ప్రధానమంత్రి నరేంద్రమోదీ లోక్ సభలో మాట్లాడుతూ ప్రభుత్వాలు కాదు పాలన తీరు మారాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. రాష్ట్రపతి ప్రసంగంపై ప్రధాని మోదీ ధన్యవాదాలు తెలిపారు. 70 సంవత్సరాల పాటు ఆర్టికల్ 370 అలాగే కొనసాగిందని మోదీ అన్నారు. కాంగ్రెస్ మాదిరిగా ఆలోచించలేదు కాబట్టే దేశంలో అనేక సమస్యలు పరిష్కారమయ్యాయని అన్నారు. దేశం అభివృద్ధి సాధించాలంటే సవాళ్లను అధిగమించి ముందుకెళ్లాలని చెప్పారు. 
 
నవీన భారత నిర్మాణాన్ని రాష్ట్రపతి ప్రసంగం ఆవిష్కరించిందని మోదీ అన్నారు. కాంగ్రెస్ దారిలో వెళితే ట్రిపుల్ తలాఖ సమస్య అలాగే ఉండేదని ప్రధాని మోదీ అన్నారు. రామ మందిరం వివాదం కూడా కాంగ్రెస్ లా ఆలోచిస్తే ఎప్పటికీ ఉండేదని మోదీ చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వంలా ఆలోచిస్తే జమ్మూకశ్మీర్ ప్రజల కష్టాలు తీరేవి కావని మోదీ అన్నారు. వాస్తవ రూపంలో కర్తాపూర్ సాహెబ్ కారిడార్ వచ్చేది కాదని చెప్పారు. 
 
ఆర్టికల్ 370 70 సంవత్సరాల పాటు అలాగే కొనసాగిందని కొన్ని సమస్యలు దశాబ్దాలుగా పరిష్కారానికి నోచుకోవటం లేదని ఆ సమస్యలను తామే పరిష్కరించామని అన్నారు. గత ప్రభుత్వ విధానాలను అనుసరిస్తే దేశంలో చారిత్రక మార్పులు జరిగేవి కాదని అన్నారు. సవాళ్లపై ఎప్పుడూ వెనుకడుగు వేయరాదని అన్నారు. అలా వెనుకడుగు వేస్తే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉండిపోతామని చెప్పారు. 
 
సమస్యలను, సవాళ్లను ఎదుర్కొనే సత్తా తమలో ఉందని మోదీ చెప్పారు. భారత్ పై ప్రపంచం ఎన్నో ఆశలను పెట్టుకుందని ఆ ఆశలను నెరవేర్చాల్సిన బాధ్యత భారత్ పై ఉందని మోదీ అన్నారు. తాము అందరినీ కలుపుకొని ముందుకు సాగాలని కృత నిశ్చయంతో ఉన్నామని చెప్పారు. జాతిపిత మహాత్మగాంధీ కాంగ్రెస్ పార్టీకి కేవలం ట్రైలర్ కావచ్చు కానీ ఎన్డీయే ప్రభుత్వానికి జాతి పితే కీలకాధారం అని అన్నారు.            

మరింత సమాచారం తెలుసుకోండి: