ప్ర‌పంచ‌వ్యాప్తంగా క‌ల‌వ‌రం సృష్టిస్తున్న ప్రాణాంతక వ్యాధి ‘కరోనా’ క్రమంగా తగ్గుముఖం పడుతోంది. కొత్త‌గా కేసులు న‌మోద‌వ‌డం త‌గ్గుతుండ‌ట‌మే కాకుండా... ప్ర‌ధానంగా చైనాలో ఈ ప్ర‌భావం తీవ్ర‌త క్షీణిస్తోంది. గత రెండు రోజులతో పోలిస్తే మంగళవారం కొత్తగా నమోదైన ‘కరోనా’ కేసులు తక్కువగా ఉన్నాయని చైనా తెలిపింది.ప్ర‌పంచ‌వ్యాప్తంగా మంగళవారంకల్లా ‘కరోనా’ వైరస్‌తో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 491 మందికి చేరుకున్నది. వ్యాధి సోకిన వారి సంఖ్య 24,324 మందికి చేరింది. వివిధ దేశాల్లో కరోనా వ్యాధి కేసులు 182కి పెరిగాయి. ఫిలిప్పైన్స్‌లో తొలి మరణం నమోదైంది. 

 

చైనా జాతీయ ఆరోగ్య కమిషన్ క‌రోనా గురించి స్పందిస్తూ...మంగళవారం 3971 నూతన కేసులు నమోదయ్యాయని  తెలిపింది. ఆదివారం 5,173 కేసులు, సోమవారం 5,072 నూతన కేసులు నమోదయ్యాయి. వుహాన్‌లో మరిన్ని ప్రత్యేక ఆస్ప‌త్రుల‌ను ఏర్పాటు చేయడంతో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయని చైనా అధికారులు తెలిపారు. 

 


మ‌రోవైపు చైనాలో..ఓ హృద‌య‌విదార‌క ఘ‌ట‌న తెర‌మీద‌కు వ‌చ్చింది. ‘కరోనా’ లక్షణాలు కనిపించడంతో ఓ తండ్రి నిర్బంధ చికిత్స కేంద్రంలోకి వెళ్లగా.. నిస్సహాయ స్థితిలో అతడి కుమారుడు ఆకలితో అలమటించి మృత్యుఒడిలోకి చేరిన హృదయ విదారక ఘటన చైనాలోని హోంగన్‌ కౌంటీలో చోటుచేసుకున్నది. యాన్‌ జియోవెన్‌కు యాన్‌చెంగ్‌ అనే 17 ఏండ్ల కొడుకున్నాడు.  పుట్టుకతోనే సెరబ్రల్‌ పాల్సీ వ్యాధి రావడంతో యాన్‌చెంగ్‌.. కదలలేడు, మాట్లాడలేడు, తనకు తానుగా తినలేడు, ఏ పని చేసుకోలేడు. కేవలం చక్రాల కుర్చీకే పరిమితమయ్యాడు. ఇదివరకే భార్య చనిపోవడంతో కొడుకును జియోవెన్‌ అల్లారుముద్దుగా పెంచుతున్నాడు. ఇటీవల జియోవెన్‌ ‘కరోనా’ వెలుగు చూసిన వుహాన్‌లో పర్యటించాడు. దీంతో అతన్ని గతనెల 22న అధికారులు నిర్బంధంలోకి తీసుకున్నారు. వైద్య పరీక్షల్లో అతడికి కరోనా సోకినట్లు నిర్ధారించిన వైద్యులు అతన్ని దవాఖానలోని ఐసోలేషన్‌ వార్డ్‌లో ఉంచారు. తండ్రికి దూరమైన యాన్‌చెంగ్‌ ఇంట్లో ఒంటరిగా ఉండాల్సి వచ్చింది. అయితే, కొడుకు పరిస్థితిని వివరిస్తూ, అతనికి ఎవరైనా ఆహారం పెట్టాలని, సాయం చేయాలని అభ్యర్థిస్తూ జియోవెన్‌ సోషల్‌మీడియాలో ఓ పోస్ట్‌ పెట్టాడు. తన కుమారుడి ఆకలి తీర్చండంటూ బంధువులు, స్థానికులను అభ్యర్థించాడు. అయితే అప్పటికే చాలా ఆలస్యమైంది. తండ్రి దవాఖానకు వెళ్లినప్పటి నుంచి ఆహారం లేక జనవరి 29నే యాన్‌చెంగ్‌ కన్నుమూశాడు

మరింత సమాచారం తెలుసుకోండి: