ప్రపంచవ్యాప్తంగా రోజురోజుకు టెక్నాలజీ ఎంతో వేగంగా అభివృద్ధి చెందుతోంది. కానీ నేటికీ సమాజంలో కుల వివక్ష కొనసాగుతూనే ఉంది. బడుగు, బలహీన వర్గాల విషయంలో కుల వివక్ష ఏ మాత్రం తగ్గడం లేదు సరికదా అంతకంతకూ పెరుగుతోంది. ఏమీ తెలియని వారు, జ్ఞానం లేని వారు కులవివక్ష చూపించారంటే అర్థం చేసుకోవచ్చు కానీ మంత్రి హోదాలో ఉన్న వ్యక్తి గిరిజన బాలుడిపై అమానుషంగా ప్రవర్తించిన ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. 
 
ఏనుగుల పునరుజ్జీవన శిబిరాన్ని ప్రారంభించటం అటవీశాఖ మంత్రి దిండిగల్ శ్రీనివాస్ తెప్పక్కాడులోని మదుమలై టైగర్ రిజర్వ్ లో ప్రారంభోత్సవానికి వఛ్చారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. శిబిరానికి వెళ్లే సమయంలో శ్రీనివాసన్ ఒక గిరిజన విద్యార్థిని పిలిచి చెప్పులను తీయాలని ఆదేశించాడు. మంత్రి అలా అడగటంతో ఏం చేయాలో అర్థం కాని ఆ విద్యార్థి మంత్రి కాళ్లకు ఉన్న చెప్పులను తొలగించాడు. 
 
ఆ తరువాత శ్రీనివాసన్ ఆలయంలోకి వెళ్లి దర్శనం చేసుకున్నాడు. గిరిజన విద్యార్థితో మంత్రి చెప్పులు తీయించిన ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దళిత సంఘాలు మంత్రి గిరిజన విద్యార్థి పట్ల అమానుషంగా ప్రవర్తించిన తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఉన్నాతాధికారులు, కలెక్టర్ అయినా మంత్రికి చెప్పి ఉంటే బాగుండేదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 
 
ఈ ఘటనలో తమిళనాడు ప్రభుత్వంపై కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తక్షణమే శ్రీనివాసన్ ను మంత్రి పదవి నుండి తొలగించాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. మంత్రి శ్రీనివాసన్ పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును నమోదు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. తమిళనాడు ప్రభుత్వం మంత్రి విషయంలో ఎలా స్పందిస్తుందో చూడాల్సి ఉంది.                                        

మరింత సమాచారం తెలుసుకోండి: