మ‌రోమారు ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర విభ‌జ‌న దేశ రాజ‌ధాని ఢిల్లీలో చ‌ర్చ‌కు తెర‌లేపింది. కీల‌క అంశం చ‌ర్చ‌కు వ‌స్తున్న త‌రుణంలో.... ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ను తీరును ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ వివ‌రించారు. ఇవాళ రాజ్య‌స‌భ‌లో రాష్ట్ర‌ప‌తి ప్ర‌సంగానికి ధ‌న్య‌వాద తీర్మానం పుర‌స్క‌రించికొని ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోదీ ప్ర‌సంగించారు. డోర్లు మూసివేసి,  లైవ్ ప్ర‌సారాల‌ను నిలిపివేసి.. తెలంగాణ రాష్ట్రాన్ని ప్ర‌క‌టించార‌ని ఆయ‌న అన్నారు.

 

 

జ‌మ్మూక‌శ్మీర్‌లో ఆర్టిక‌ల్ 370 ఎత్తివేత‌పై ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోదీ స్పందిస్తూ...ఎటువంటి చ‌ర్చ‌లు లేకుండా క‌శ్మీర్‌పై నిర్ణ‌యం తీసుకున్నార‌ని ప్ర‌తిప‌క్ష నేత గులాం న‌బీ ఆజాద్ చేసిన వ్యాఖ్య‌ల‌ను తిప్పికొడుతూ...ప్ర‌త్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ప్ర‌క‌టించిన తీరును ప్ర‌ధాని మోదీ మ‌రోసారి పార్ల‌మెంట్‌లో గుర్తు చేశారు. ఆజాద్ ఆరోప‌ణ‌ల్లో వాస్త‌వం లేద‌ని ప్ర‌ధాని తెలిపారు. క‌శ్మీర్ అంశంపై జ‌రిగిన చ‌ర్చ‌ను యావ‌త్ దేశం చూసింద‌ని, ఎంపీలంతా ఆ అంశానికి అనుకూలంగా ఓటేశార‌ని మోదీ అన్నారు.  కానీ తెలంగాణ ఇచ్చిన స‌మ‌యంలో స‌భ‌లో జ‌రిగిన స‌న్నివేశాల‌ను గుర్తు చేసుకోవాల‌ని ప్ర‌ధాని కామెంట్ చేశారు. మొద‌టిసారి జ‌మ్మూక‌శ్మీర్ ప్ర‌జ‌లు రిజ‌ర్వేష‌న్ల ల‌బ్ధి పొందార‌ని త‌మ నిర్ణ‌యం గురించి మోదీ చెప్పుకొచ్చారు.మ‌రోఎంపీ వైకోకు సైతం మోదీ కౌంట‌ర్ ఇచ్చారు. జ‌మ్మూక‌శ్మీర్‌కు ఆగ‌స్టు 5వ తేదీ.. బ్లాక్ డే అని వైకో అన్నార‌ని, కానీ అది ఉగ్ర‌వాదం, వేర్పాటువాదం ప్రోత్స‌హిస్తున్న వారికి బ్లాక్ డే అని ఎత్తిపొడిచారు.

 

గ‌త కొద్దికాలంగా త‌న‌ను టార్గెట్ చేసుకొని సాగుతున్నపౌర‌స‌త్వ స‌వ‌ర‌ణ చ‌ట్ట వ్య‌తిరేక ఆందోళ‌న‌ల‌పై సైతం ప్ర‌ధాన‌మంత్రి స్పందించారు.  ఇన్నాళ్లూ సైలెంట్‌గా ఉన్నా ఎంపీలంతా ఇప్పుడు వాయిలెంట్‌గా మారార‌న్నారు. పౌర‌స‌త్వ స‌వ‌ర‌ణ చ‌ట్టానికి వ్య‌తిరేకంగా ప్ర‌తిప‌క్షాలు చేస్తున్న రాద్దాంతం దుర‌దృష్ట‌క‌ర‌మ‌న్నారు. త‌మ ఆర్థిక విధానాల గురించి స్పందిస్తూ...నిరాశ ఏ దేశానికి మంచి కాదు అని, 5 ట్రిలియ‌న్ల ఆర్థిక వ్య‌వ‌స్థ గురించి అంద‌రూ పాజిటివ్‌గా మాట్లాడాల‌న్నారు. జీఎస్టీ గురించి మీకు అమోఘ‌మైన జ్ఞానం ఉంటే, మ‌రి మీరెందుకు దాన్ని మీవ‌ద్దే ఉంచుకున్నారని ప్ర‌శ్నించారు. చిన్న చిన్న న‌గ‌రాలు కూడా డిజిటిల్ లావాదేవీల్లో దూసుకువెళ్తున్నాయ‌ని మోదీ చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: