దేశంలో రోజురోజుకు అత్యాచారాలకు సంబంధించిన ఘటనలు పెరిగిపోతున్నాయి. ఈ అత్యాచార ఘటనల్లో మెజారిటీ కేసుల్లో సరైన సాక్ష్యాలు లభించకపోవటం వలన నిందితులకు శిక్ష పడటం లేదు. కొన్ని కేసుల్లో నిందితులకు ఉరిశిక్ష పడినా నేరస్థులు చట్టాల్లోని లోపాలను ఉపయోగించుకొని ఉరి వాయిదా పడేలా చేస్తున్నారు. అత్యాచార కేసుల్లో కామాంధులకు శిక్షలు పడుతున్నాయి కానీ అమలు విషయంలో మాత్రం జాప్యం జరుగుతోందని ప్రజల నుండి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 
 
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ కేసులో నిందితులకు గత నెలలోనే ఉరి తీయాల్సి ఉండగా నిందితులు చట్టంలోని లోపాలను అడ్డం పెట్టుకొని ఉరి వాయిదా పడేలా చేశారు. ఉరి ఫిబ్రవరి 1కు వాయిదా పడగా నిందితులలో ఒకరు క్షమాభిక్ష పిటిషన్ వేయడంతో ఉరిశిక్ష అమలు మరోసారి జాప్యం అయింది. ఏడు సంవత్సరాల క్రితం జరిగిన నిర్భయ అత్యాచార ఘటనకు ఏడు సంవత్సరాల తరువాతైనా న్యాయం జరిగిందనుకునేలోపు ఉరిశిక్ష అమలు జాప్యం జరుగుతూ ఉండటంపై నిర్భయ తల్లి నుండి, ప్రజల నుండి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. 
 
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సంచలం సృష్టించిన సమత కేసులో ముగ్గురు దోషులకు ఉరిశిక్ష విధిస్తూ అదిలాబాద్ ఫాస్ట్ ట్రాక్ కోర్టు తీర్పు చెప్పింది. తాజాగా ఈరోజు ఏడేళ్ల క్రితం మెడికో భార్గవి, భార్గవి తల్లిని హత్య చేసిన నిందితుడు ఇంతియాజ్ కు కోర్టు ఉరిశిక్ష విధించింది. 2013 నుండి వాదనలు జరిగిన ఈ కేసులో ఈరోజు న్యాయస్థానం తీర్పును వెల్లడించింది. 
 
హజీపూర్ వరుస హత్యల కేసుల్లో నిందితునిగా ఉన్న శ్రీనివాస్ రెడ్డికి కోర్టు ఈరోజు ఉరిశిక్ష విధించింది. కోర్టులు ఉరిశిక్షలు విధిస్తున్నా అమలులో జాప్యం జరుగుతోందని చట్టాల్లో మార్పులు చేయాల్సి ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఉరిశిక్ష అమలులో జాప్యం జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని అప్పుడే బాధితులకు తగిన న్యాయం జరుగుతోందని నిందితులకు ఉరిశిక్ష విధించటంతో పాటు త్వరితగతిన ఉరిశిక్ష అమలు చేస్తేనే న్యాయం జరుగుతోందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: