రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పెడన ఎమ్మెల్యే జోగి రమేశ్‌కి ఊహించని షాక్ తగలనుందా? అంటే నియోజకవర్గంలో కొన్ని కొన్ని పరిస్తితులని చూస్తుంటే అవుననే టాక్ వినిపిస్తుంది. ఏపీ ప్రభుత్వం స్థానిక ఎన్నికల్లో భాగంగా మొదట మున్సిపాలిటీ ఎన్నికలని నిర్వహించడానికి సిద్ధమవుతుందని వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ మేరకు ఎన్నికల సంఘం కూడా సన్నద్దమవుతుందని ప్రకటనలు కూడా వచ్చాయి.

 

అంతా అనుకున్నట్లు జరిగితే మార్చిలో మున్సిపల్ ఎన్నికలు జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే ఈ మున్సిపల్ ఎన్నికల్లో పెడన మున్సిపాలిటీలో వైసీపీ విజయం సాధించడం అంతా సులువు కాదని పెడన పట్టణంలో చర్చలు జరుగుతున్నాయి. మామూలుగానే పెడన మున్సిపాలిటీ టీడీపీకి కంచుకోటగా ఉంటూ వస్తుంది. మున్సిపాలిటీ ఆవిర్భావించిన దగ్గర నుంచి ఇక్కడ టీడీపీనే విజయం సాధించింది. వైఎస్సార్ హయాంలో కూడా టీడీపీ జెండానే ఎగిరింది.

 

2014 అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో పెడనలో టీడీపీకి వైసీపీ గట్టి పోటీఇచ్చింది. కానీ గెలవలేకపోయింది. మొత్తం 23 వార్డుల్లో టీడీపీ 12 గెలిస్తే, వైసీపీ 11 గెలిచింది. దాంతో మళ్ళీ పట్టణం టీడీపీకే దక్కింది. అయితే రెండేళ్ళు పోయాక టీడీపీ ఛైర్మన్ చనిపోవడం, టీడీపీలోని ఒక కౌన్సిలర్ వైసీపీకి మద్ధతు తెలపడంతో మున్సిపల్ పీఠం వైసీపీకి వచ్చింది. ఇక రాబోయే ఎన్నికల్లో కూడా వైసీపీనే మళ్ళీ గెలవాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది.

 

కాకపోతే 2019 అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఉన్న పరిస్థితులు ఇప్పుడు లేవని తెలుస్తోంది. ఎమ్మెల్యేగా జోగి రమేశ్ బాగానే పనిచేస్తున్న, పట్టణ ప్రాంతంలో కాస్త వైసీపీకి అనుకూల పవనాలే ఉన్నట్లు తెలిసింది. ఇక్కడ ప్రభుత్వ పథకాలు సరిగా అందడం లేదనే టాక్ ఉంది. తాజాగా కూడా పెన్షన్ల విషయంలో కూడా కాస్త ఇబ్బందికర పరిస్థితులు వచ్చినట్లు తెలిసింది. ముఖ్యంగా పట్టణ ప్రాంతంలో ఉన్న అన్నా క్యాంటీన్ మూసివేయడం వల్ల, టౌన్‌లో కార్మికులు కాస్త ఎక్కువ ఇబ్బందులు పడినట్లు తెలిసింది. మొత్తం మీద ఈ పరిస్థితులన్నీ చూసుకుంటే పెడన మున్సిపాలిటీ జోగి రమేశ్‌కు షాక్ ఇచ్చే అవకాశముంది.

మరింత సమాచారం తెలుసుకోండి: