టెన్నిస్ రంగంలో మరో తెలుగు తేజం మెరిసింది.  టెన్నిస్ రంగంలో మరో ఆశా కిరణం తళుక్కుమంది. ఏకంగా టెన్నిస్ వరల్డ్ చాంపియన్ రఫేల్ నాదల్ అకాడమీ నిర్వహించిన అండర్ 16 పోటీల్లో తొలి కప్పు గెలుచుకుని తెలుగు పతాకాన్ని విశ్వ వీధుల్లో ఎగరేసింది. టెన్నిస్ లో సరికొత్త లక్ష్యాలనందుకుంటానంటూ భరోసా ఇచ్చింది. ఇన్ని ఘనతలు సాధించిన ఆ ఆశా కిరణం అడివి హర్షిత.

 

 

టెన్నిస్ లో రఫేల్ నాదల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ప్రపంచ చాంపియన్ గా విశ్వవిఖ్యాతిగాంచిన నాదల్.. కువైట్ లో అకాడమీ ప్రారంభించాడు. ఆ ప్రారంభం సందర్భంగా అక్కడ నిర్వహించిన అండర్ 16 పోటీల్లో బాలికల తరపున అడవి హర్షిత ఛాంపియన్ గా అవతరించింది. తెలుగు క్రీడారంగంలో ఈ కొత్త కిరణం ఎన్నో ఆశలు రేకెత్తించింది.

 

 

మరి ఇంతకీ ఎవరీ అడివి హర్షిత.. ఈ చిన్నారి నేపథ్యం ఏంటి.. కువైట్ లో తెలుగు సమాజానికి గర్వకారణంగా నిలిచిన అడవి హర్షిత ఎవరు..? ఈ వివరాల్లోకి వెళ్తే.. అడివి హర్షిత ప్రస్తుతం కువైట్ లోనే నివశిస్తోంది. హర్షిత కుటుంబీకులది పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం. ఆమె తండ్రి బాలా శివ శ్రీకాంత్, తల్లి మోహిని విమల కిరణ్. ఈ దంపతుల ముద్దుల కూతురు హర్షిత. శ్రీ బాలా కువైట్ లోని కువైట్ ఆయిల్ కంపెనీలో టిపిఎల్ స్పెషలిస్ట్ గా పని చేస్తున్నారు.

 

 

హర్షిత ప్రస్తుతం కువైట్ లోని డిల్లీ పబ్లిక్ స్కూల్ లో 9వ తరగతి చదువుతోంది. చిన్ననాటి నుంచి ఆటలంటే హర్షితకు అమితాసక్తి. దీన్ని గమనించిన ఆమె తల్లిదండ్రులు ఆమెను బాగా ప్రోత్సహించారు. దాని ఫలితంగా హర్షిత ఈ నాదల్ అకాడమీ అండర్ 16 విజేతగా ఆవిర్భవించింది. చిరు ప్రాయంలోనే అద్భుత ప్రతిభ చూపించిన హర్షిత ముందు ముందు మరిన్ని విజయాలు నమోదు చేయాలని కోరుకుందాం. తెలుగు ఖ్యాతిని ఇనుమడింపజేస్తుందని ఆశిద్దాం.

 

మరింత సమాచారం తెలుసుకోండి: