హైద‌రాబాద్‌లోని ప్ర‌యాణికుల‌కు మ‌రో గుడ్ న్యూస్‌. శుక్రవారం సాయంత్రం 4 గంటలకు సీఎం కేసీఆర్ రెండో కారిడార్‌ జేబీఎస్‌-ఎంజీబీఎస్‌ మార్గాన్ని ప్రారంభించనున్నారు. మెట్రో కారిడార్‌-2 జేబీఎస్‌ నుంచి ఎమ్‌జీబీఎస్‌ ప్రారంభోత్సవ కార్యక్రమం సందర్భంగా శుక్రవారం హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు సికింద్రాబాద్‌ సంగీత్‌ జంక్షన్‌ వద్ద ట్రాఫిక్‌ మళ్ళింపును విధించారు. ఈ అంక్షలు సాయంత్రం 3 నుంచి 5.30 గంటలకు అమల్లో ఉంటాయని ట్రాఫిక్‌ అడిషనల్ సీపీ అనిల్‌ కుమార్‌ తెలిపారు.అయితే, ఈ మెట్రో అనేక ప్ర‌త్యేక‌త‌ల‌ను క‌లిగి ఉంది. 

 

ఈ కారిడార్‌తో జిల్లాల నుంచి హైదరాబాద్‌ వచ్చే వారికి ఎంతో ఉపయోగపడనుంది. జేబీఎస్‌-ఎంజీబీఎస్‌లను లింక్‌ చేస్తూ నగరంలోనే ప్రధాన బస్టాండ్‌లు అనుసంధానం అయ్యేలా... రెండో కారిడార్‌ను నిర్మించారు. ఈ కారిడార్‌ ప్రారంభంతో 11 కిలోమీటర్ల మేర మెట్రో అందుబాటులోకి రానుంది. దీంతో నగరంలో మొత్తం 68 కిలోమీటర్ల మేర మెట్రో రైళ్లు పరుగులు పెట్టనున్నాయి. ఈ ప్రాజెక్టులో భాగంగా జేబీఎస్‌ మెట్రో స్టేషన్‌ను ఐదు అంతస్తుల్లో నిర్మించారు. ఇప్పుడిదే నగరంలోని అన్ని మెట్రో స్టేషన్లకన్నా పెద్దది.

 

 

ఐదు అంతస్తుల ఎత్తులో రైలు ప్రయాణం ఎంతో అనుభూతిని ఇవ్వనుంది. సికింద్రాబాద్‌ వైఎంసీఏ కూడలి వద్ద గతంలో నిర్మించిన ఫ్లైఓవర్‌ ఉండటంతో దానికి  సమాంతరంగా నాగోల్‌- రాయదుర్గం మెట్రో మార్గాన్ని నిర్మించారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఈ రెండు నిర్మాణాల పైన కారిడార్‌-2లోని జేబీఎస్‌ నుంచి ఎంజీబీఎస్‌ మార్గంలో దీన్ని 63 అడుగుల ఎత్తులో నిర్మించారు. ఉత్తర తెలంగాణ ప్రాంతానికి కనెక్టివిటీ పెంచే జేబీఎస్‌ బస్‌ స్టేషన్‌కు అనుసంధానంగా ఇది ప్రయాణికులకు సేవలందించనుంది. 

 

ఇక ప్రారంభోత్స‌వం సంద‌ర్భంగా ట్రాఫిక్ ఆంక్ష‌ల్లో భాగంగా, సంగీత్‌, సెయిట్‌ జాన్‌ రోటరీ నుంచి వచ్చే వాహనాలును వైఎంసీ జంక్షన్‌ వద్ద నిలిపేసి వాటిని ఎస్‌బీఐ నుంచి స్వీకార్‌, ఉప్‌కార్‌, టివోలి మీదుగా పంపిస్తారు. సికింద్రాబాద్‌ క్లబ్‌, జేబీఎస్‌ పికెట్‌, టివోలి జంక్షన్‌ మీదుగా వచ్చే వాహనాలను ఎస్‌బీఐ జంక్షన్‌, వైఎంసీఏ ఎడమకు మళ్ళిస్తారు. మారేడ్‌పల్లి, వెస్ట్‌ మారేడ్‌పల్లి నుంచి వచ్చే వాహనదారులన సర్‌వాసుకీ కాలనీ టీ జంక్షన్‌ నుంచి ఉత్తర మండంల జీహెచ్‌ఎమ్‌సీ కార్యాలయం, కోర్టు వీధి, సెయింట్‌ రోటరీ వైపు పంపిస్తారు. ఈ మళ్ళింపులు, అంక్షలను దృష్టిలో పెట్టుకుని వాహనదారులు ఈ సమయాల్లో తమ ప్రయాణాన్ని ప్రత్యామ్నాయ మార్గోలో వెళ్ళే విధంగా ప్రణాళిక చేసుకోవాలని అదనపు సీపీ కోరారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: