అడివి హర్షిత.. ఎడారి దేశంలో తళుక్కున మెరిసిన తెలుగు క్రీడాతార. టెన్నిస్ రంగంలో  బాగా రాణిస్తుస్తున్న  అచ్చ తెలుగు బాలిక అడివి హర్షిత. టెన్నిస్ రంగంలో విశ్వ విజేతగా పేరు ప్రఖ్యాతులు పొందిన రఫేల్ నాదల్.. కువైట్ లో అకాడమీ నెలకొల్పిన సందర్భంగా ఏర్పాటు చేసిన అండర్ 16 పోటీల్లో బాలికల విభాగంలో విజేతగా నిలిచింది. కువైట్ లోని తెలుగు సమాజానికి గర్వకారణంగా నిలిచింది.

 

అడివి హర్షిత కువైట్‌లోనే చదువుకుంటున్నా.. ఆమె మూలాలు మాత్రం మన తెలుగు నేలలోనే ఉన్నాయి. ఆమె తండ్రి శ్రీ బాలా శివ శ్రీకాంత్ స్వస్థలం. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం. ఆయన కువైట్ లోని కువైట్ ఆయిల్ కంపెనీలో టిపిఎల్ స్పెషలిస్ట్ గా పని చేస్తున్నారు. ఇక అడివి హర్షిత విషయానికి వస్తే.. చిరు ప్రాయంలోనే బహుముఖ ప్రజ్ఞతో ఆశ్చర్యపరుస్తోందీ బాలిక. ఎవరైనా ఒక విషయంలో రాణించడం సహజమే. కానీ అడవి హర్షిత మాత్రం.. ఏక కాలంలో పలు రంగాల్లో రాణిస్తూ తెలుగు వారికి గర్వకారణంగా నిలుస్తోంది.

 

రఫేల్ నాదల్ అకాడమీ అండర్ 16 బాలికల విభాగంలో కప్పు కొట్టేసిన హర్షిత.. అటు నాట్యంలోనూ.. ఇటు చదువులోనూ అద్భుతమైన ప్రతిభ చూపుతోంది. కువైట్ లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌లో చదువుతోంది. భరత నాట్యం, కూచిపూడిలోనూ శిక్షణ పొందింది. గురువుల మెప్పు పొందేలా అద్భుతంగా నాట్యంలోనూ రాణిస్తోంది. నాట్య మయూరిగా శిక్షకులతో ప్రశంసలందుకుని.. అరంగేట్రం పూర్తి చేసుకుని నాట్య ప్రదర్శనలూ ఇస్తోంది.

 

అటు ఆటలు, ఇటు నాట్యం.. ఇలా రెండు రంగాల్లోనూ రాణిస్తున్నా.. చదువును ఏనాడూ నిర్లక్ష్యం చేయలేదు హర్షిత. నూటికి 90 శాతంపైగా మార్కులు తెచ్చుకుంటూ చదువుల సరస్వతిగా ఉపాధ్యాయుల మెప్పు పొందుతోంది. ఇలా పలు రంగాల్లో రాణిస్తూ.. కన్నవారికి గర్వకారణంగా నిలుస్తోంది. అందుకే అన్నారేమో.. ముదితల్ నేర్వగరాని విద్య కలదే.. ముద్దార నేర్పించినన్..అని. ఈ చిన్నారి హర్షిణి.. తాను ఆకాంక్షించిన రంగంలో అత్యున్నత శిఖరాలు అందుకోవాలని.. తెలుగు ఖ్యాతిని నలుదిశగా వ్యాపింపజేయాలని ఆశిద్దాం.

 

మరింత సమాచారం తెలుసుకోండి: