గత ఏడాది అత్యంత వివాదాస్సదమైన అంశాల్లో శబరిమల అంశం ఒకటి. సుప్రీం కోర్టు అయ్యప్ప ఆలయంలోకి మహిలలను అనుమతిస్తూ తీర్పు ఇవ్వటంతో పలువురు మహిళలు అయ్యప్పను దర్శించుకునేందుకు ప్రయత్నించారు. వారిని స్వాములు అడ్డుకోవటంతో కొద్ది రోజుల పాటు అక్కడ యుద్ధ వాతావరణం కనిపించింది. కానీ తరువాత పరిస్థితులు సద్దుమణిగాయి. కేరళ ప్రభుత్వం కూడా పట్టువీడటంతో శబరిమలలో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. అప్పట్లో సుప్రీం కోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా కేరళ వామపక్ష ప్రభుత్వం వ్యవహరించింది. మరోవైపు సుప్రీం ఉత్తర్వులు ఆలయ సంప్రదాయాలకు విరుద్ధమని బీజేపీ, ఆరెస్సెస్‌ సహా హిందూ సంస్ధలు పెద్ద ఎత్తున నిరసనలకు దిగాయి. దీంతో కేరళ ప్రభుత్వం కూడా స్వరం మార్చింది. ఆలయ సాంప్రదాయాలు కాపాడేందుకు కేంద్రం నిర్ణయం తీసుకోవాలని కేరళ సర్కార్ వ్యాఖ్యానించటంతో పరిస్థితి సద్దుమణిగింది. 


కానీ ఈ విషయంపై కోర్టుల్లో విచారణ మాత్రం కొనసాగుతూనే ఉంది. ఇటీవల ఈ అంశాన్ని విచారించేందుకు విస్తృత ధర్మాసనాన్ని ఏర్పాటు చేసింది సుప్రీం. అన్ని అంశాలను పరిశీలించిన ధర్మాసనం తీర్పును రిజర్వ్‌లో ఉంచింది. ఆలయంలోకి అన్ని వయసుల మహిళలను అనుమతిస్తూ ఇచ్చిన తీర్పుపై సమీక్ష సందర్భంగా ఐదుగురు సభ్యుల విస్తృత ధర్మాసనం మత వ్యవహారాలకు సంబంధించిన కొన్ని అంశాలను పరిశీలిస్తుందని తెలిపారు. అయితే ఈ కేసులో కక్షిదారుల తరఫు న్యాయవాదులు దీన్ని గట్టిగా వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాన న్యాయమూర్తి ఎస్‌.ఎ.బాబ్డే నేతృత్వంలోని బెంచ్‌ గురువారం కేసును విచారించింది.


సుధీర్ఘంగా జరిగిన ఈ విచారణ తరువాత న్యాయమూర్తి ఎస్‌.ఎ.బాబ్డే తీర్పును రిజర్వ్‌లో ఉంచినట్టుగా వెల్లడించారు. విచారణకు సంబంధించిన అంశాలను సోమవారం వెల్లడిస్తారని అదే రోజు విస్తృత ధర్మాసనం విచారించాల్సిన అంశాలను కూడా వెల్లడిస్తామని బాబ్డే తెలిపారు. కక్షిదారుల తరఫున వాదిస్తున్న సీనియర్‌ న్యాయవాది ఫాలీ ఎస్‌. నారిమన్‌తో ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ ఢిల్లీ న్యాయాధికారుల కేసును ఉదహరించారు. ఇప్పటికే సుప్రీం వెల్లడించిన ఓ తీర్పు విషయంలో విచారణ జరుగుతున్న సమయంలో న్యాయపరమైన ప్రశ్నలు సరికాదని సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాదులు అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: