గడచిన ఎనిమిది నెలల పరిపాలన చూస్తే జగన్మోహన్ రెడ్డి ఈ స్ధాయిలో ఇంత స్పీడుగా యాక్ట్ చేస్తారని ఎవరూ ఊహించలేదు. మామూలుగా ప్రత్యర్ధులపై బురద చల్లటంలో తెలుగుదేశంపార్టీ చాలా స్పీడుగా ఉంటుంది. టిడిపికి మద్దతుగా ఎల్లోమీడియా స్పీడు కూడా అందరికీ తెలిసిందే.  అలాంటిది కియా కార్లు ఉత్పత్తి ప్లాంటు తరలింపు ప్రచారం విషయంలో  టిడిపికన్నా జగన్ చాలా స్పీడుగా వ్యవహరించి జరగాల్సిన డ్యామేజీని బాగా కంట్రోల్ చేశారు.

 

ఇంతకీ విషయం ఏమిటంటే అనంతపురం నుండి కియా కార్ల తయారీ యూనిట్ తమిళనాడుడకు తరలిపోతోందంటూ ప్రముఖ మీడియా సంస్ధ రాయటర్స్ ఓ కథనాన్ని అచ్చేసింది. మామూలుగా అయితే దాన్ని పట్టుకుని చంద్రబాబునాయుడు నుండి క్రిందస్ధాయి వరకూ ఊదరగొట్టేయాలి. జగన్ ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోయాలి. వైసిపి ప్రభుత్వాన్ని గుక్క తిప్పుకోనీయకుండా ఎల్లోమీడియా సాయంతో దండయాత్ర చేసి కళ్ళుబైర్లు కమ్మేట్లు చేయాలి.

 

కానీ చంద్రబాబుకు, టిడిపి నేతలతో పాటు ఎల్లోమీడియాకు కూడా జగన్ అవకాశం ఇవ్వలేదు. మామూలుగా అయితే ఇటువంటి వాటి విషయంలో జగన్ స్పందనను ఊహించలేము. కానీ కియా మోటార్స్ విషయంలో ఎందుకోగానీ జగన్ చాలా స్పీడుగా రియాక్ట్ అయ్యారు. రాయటర్స్ లో కథనం రావటం ఆలస్యం వెంటనే మంత్రులు బుగ్గన రాజేంద్రనాధరెడ్డి, మేకపాటి గౌతమరెడ్డి యాక్షన్లోకి దిగేశారు. వీళ్ళతో పాటు రాజంపేట ఎంపి మిథున్ రెడ్డి, పరిశ్రమలశాఖ ముఖ్యకార్యదర్శి రజత్ భార్గవ్ కూడా రంగంలోకి దిగేశారు.

 

అందరూ కియా మోటార్స్ కంపెనీ ఎండితో మాట్లాడారు. వెంటనే సేల్స్ హెడ్ నుండి ఓ రిజాండర్ జారీ అయిపోయింది. ప్రభుత్వం తరపున కూడా రాయటర్స్ కు రిజాండర్ వెళ్ళిపోయింది. తమిళనాడు ప్రభుత్వం కూడా అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. కియా మోటార్స్ తమిళనాడుకు వస్తోందని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని చెప్పేసింది.

 

ఇలా అన్నీ వైపుల నుండి రాయటర్స్ కథనంపై ఖండనలు రావటంతో చంద్రబాబు, టిడిపి నేతలకు ఆరోపణలు, విమర్శలు చేసే అవకాశం రాలేదు. కాకపోతే ఇదే  విషయాన్ని పార్లమెంటులో లేవనెత్తిన టిడిపి ఎంపిలను వైసిపి ఎంపిలు అడ్డుకుని వాస్తవం ఏమిటో చెప్పారు. దాంతో జగన్ స్పందించిన తీరుతో ప్రత్యర్ధులందరూ బిత్తరపోయారు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: