తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేట జిల్లాలో జరిగిన కాల్పులు కలకలం సృష్టిస్తున్నాయి. సదానందం అనే వ్యక్తి గంగరాజు అనే వ్యక్తిపై ఏకె 47తో కాల్పులు జరిపాడు. సదానందం కాల్పులు జరిపినా గంగరాజు కాల్పుల నుండి తృటిలో తప్పించుకున్నాడు. ఆ తరువాత సంఘటనా స్థలం నుండి సదానందం పరారయ్యాడు. పూర్తి వివరాలలోకి వెళితే సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలో ఈరోజు తెల్లవారుజామున ఏకె 47 పేలడంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురయ్యారు. 
 
సదానందం అనే వ్యక్తి పోలీస్ స్టేషన్ కు కూతవేటు దూరంలోనే గంగరాజు అనే వ్యక్తిపై కాల్పులు జరిపాడు. సదానందం రెండు రౌండ్లు కాల్పులు జరిపాడు.రెండు రౌండ్ల కాల్పులలో గంగరాజు తప్పించుకోవడంతో గంగరాజుకు ప్రాణాపాయం తప్పింది. సదానందంకు ఏకె 47 ఎక్కడినుండి వచ్చిందని స్థానికంగా చర్చ జరుగుతోంది. మేకల కాపరిగా అక్కన్నపేటలో జీవనం సాగించే సదానందం ఏకె 47 తో కాల్పులు జరపడటంతో ఈ ఘటన సిద్దిపేట జిల్లా అంతటా చర్చనీయాంశంగా మారింది. 
 
ఒక ప్రహరీ గోడకు సంబంధించిన విషయంలో సదానందం, గంగరాజు మధ్య గత కొంతకాలంగా వివాదం నడుస్తున్నట్టు తెలుస్తోంది. తరచూ గొడవలు జరుగుతూ ఉండటంతో ఆగ్రహానికి గురైన సదానందం ఏకె 47ను తీసుకొనివెళ్లి రెండు రౌండ్లు కాల్పులు జరిపాడు. పెద్ద శబ్దం రావడంతో స్థానికులకు కొంత సమయంపాటు అక్కడ ఏం జరిగిందో కూడా అర్థం కాలేదు. 
 
ఆ తరువాత తన భార్య పిల్లలతో సహా సదానందం పరారయ్యాడు. పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ జరుపుతున్నారు. సదానందం కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. సదానందంకు మావోయిస్టులతో ఏవైనా సంబంధాలు ఉన్నాయా...? అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. సదానందం బంధువులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నట్టు సమాచారం.                 

మరింత సమాచారం తెలుసుకోండి: