ఢిల్లీ ఎన్నికలకు సర్వం సిద్ధమయ్యింది..! ప్రచార హోరు ముగియడంతో పోలింగ్ ఏర్పాట్లపై ఎన్నికల సంఘం దృష్టిపెట్టింది. రేపు ఉదయం ఏడు గంటలకు ఓటింగ్ ప్రారంభమవుతుంది...! ప్రజలు పెద్ద సంఖ్యలో ఓటింగ్‌లో పాల్గొనేందుకు వీలుగా అనేక సంస్థలు ఆఫర్‌లు ప్రకటిస్తున్నాయి. మరోవైపు ప్రచారం చివరి రోజు నిర్వహించిన ఒపీన్ పోల్స్‌ కూడా అధికారం ఆప్‌దేనని స్పష్టం చేస్తున్నాయి.

 

వచ్చే ఐదేళ్ల పాటు దేశ రాజధానిని పాలించేది ఎవరో నిర్ణయించేందుకు ఢిల్లీ ఓటర్లు సమాయత్తమవుతున్నారు. నిన్నటి వరకు అన్ని పార్టీల ప్రచారాన్ని, హామీలను ఓపిగ్గా ఉన్న సగటు ఢిల్లీ ఓటరు తమ నాయకుడిని ఎన్నుకునేందుకు రెడీ అయ్యారు. రేపు జరిగే పోలింగ్‌లో మొత్తం కోటి 47 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. ఢిల్లీ రాష్ట్ర పరిధిలో మొత్తం 13750 పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేసింది ఎన్నికల సంఘం. 

 

ఢిల్లీ ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా నిర్వహించేందుకు ఈసీ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తోంది. 190 కంపెనీలకు చెందిన సెంట్రల్ పారామిలటరీ బలగాలను ఈసారి భద్రత కోసం వినియోగిస్తున్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఢిల్లీలో మోహరించిన బలగాల సంఖ్య కంటే ఇది నాలుగు రెట్లు ఎక్కువ. ఓటర్లు పెద్ద ఎత్తున పోలింగ్‌లో పాల్గొనేందుకు వీలుగా కొన్ని సంస్థలు ఆఫర్లు ప్రకటించాయి. ఢిల్లీలో ఓటు హక్కు ఉండి వేరే ప్రాంతాల్లో ఉంటున్న వారికి స్పైస్ జెట్ అద్భుతమైన ఆఫర్ ప్రకటించింది. స్పైస్ డెమొక్రసీ పేరుతో ఉచిత ప్రయాణి టిక్కెట్లను  జారీ చేస్తోంది. ముందుగా నమోదు చేసుకున్న వాళ్లకు బేస్ ఫెయిర్‌ను రద్దు చేస్తారు... కేవలం పన్నులు చెల్లిస్తే సరిపోతుంది. మరోవైపు ఓటర్ల సౌకర్యం కోసం ఢిల్లీ మెట్రో రైల్ గంటన్నర ముందు నుంచే సర్వీసులు ప్రారంభిస్తోంది. ఉదయం 4 గంటల నుంచే ఢిల్లీలో మెట్రో సర్వీసులు ప్రారంభమవుతున్నాయి.

 

ఢిల్లీ ఎన్నికల్లో గెలుపుపై ఎవరి లెక్కలు వాళ్లు వేసుకుంటున్నా ఒపీనియన్ పోల్స్ సర్వేలు మాత్రం మరోసారి ఆప్‌దే అధికారమంటున్నాయి. జనవరి ఆరు నుంచి నిన్నటి వరకు ఆరు సార్లు వివిధ సంస్థలు సర్వేలు నిర్వహించాయి. అన్నింటిది ఒకటే మాట. ఆమ్ ఆద్మీ పార్టీ 48 నుంచి 60 సీట్లు కైవసం చేసుకుంటుందన్నది ఒపీనియన్ పోల్స్ సారాంశం. ఉచిత విద్యుత్, ఉచిత నీటి సరఫరా, బస్తీ వాసులకు నాణ్యమైన వైద్యం, ప్రభుత్వ పాఠశాలల బలోపేతం ఇలాంటి మధ్యతరగతిని ప్రభావితం చేసే అనే పథకాలను అమలు చేస్తున్న కేజ్రీవాల్‌కు ఢిల్లీ ఓటర్లు మరోసారి అవకాశం ఇస్తారంటున్నాయి సర్వేలు. 2015 ఎన్నికల్లో కేవలం 3 సీట్లకు మాత్రమే పరిమితమైన బీజేపీ ఈసారి ఢిల్లీలో అధికారం కైవసం చేసుకోవాలని పట్టుదలతో ఉంది. పౌరసత్వ సవరణ చట్టం అమలులోకి వచ్చిన తర్వాత జరుగుతున్న తొలి అసెంబ్లీ ఎన్నికలు కావడంతో బీజేపీకి ఇవి అగ్ని పరీక్షగానే చెప్పాలి. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా షహీన్‌ బాగ్‌లో కొనసాగుతున్న ఆందోళనలు కూడా ఈ సారి ఎన్నికల్లో గెలుపోటములను నిర్ణయించబోతున్నాయి. గత ఎన్నికల్లో పూర్తిగా తుడిచిపెట్టేసుకుపోయిన కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నికల్లో ప్రజలు ఎలాంటి తీర్పు ఇస్తారన్నది కూడా చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: