హైదరాబాద్‌లో చిన్నారుల విక్రయం మరోసారి వెలుగులోకి వచ్చింది. రెండు వారాల పసికందును అమ్మేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసులు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.. ఈ ముఠాకు చెందిన ఏడుగురు సభ్యలును అదుపులోకి తీసుకున్నారు.. మొత్తం ఇద్దరు చిన్నారులను రెస్క్యూ చేశారు.

 

పసికందులను విక్రయించే ముఠా..! పిల్లలను కిడ్నాప్‌ చేయడం.. లేకుంటే కొనుగోలు చేయడం, అవసరమైన వారికి విక్రయించడం వీరి పని..! మూడో కంటికి తెలీకుండా ఈ తతంగం పూర్తి చేయడంలో వీళ్లు సిద్ధహస్తులు. మారుమూల గ్రామాలకు వెళ్లి అక్కడ నిరుపేద కుటుంబాలను గుర్తిస్తారు. వారికి మాయమాటలు చెప్పి, డబ్బు ఆశ చూపించి పిల్లలను కొనుగోలు చేస్తారు.. ఆ తర్వాత అవసరమైనవారికి పిల్లల్ను అమ్మేస్తుంటారు.

 

పసికందులను విక్రయించే ముఠాలో ఇద్దరు కీలకంగా వ్యవహరిస్తారు. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన బాబురెడ్డి,  కడప జిల్లాకు చెందిన గంగాధర్‌రెడ్డి కీలకం.! వీళ్లిద్దరూ ఊళ్లకు వెళ్లి పసికందులను తీసుకువచ్చి విక్రయిస్తుంటారు.. ఒక్కో  చిన్నారిని 20 వేల నుంచి 30 వేలు ఇచ్చి కొనుగోలు చేస్తారు. చిన్నారుల సమాచారం ఇచ్చే మధ్యవర్తులకు 30వేల వరకూ ఇస్తుంటారు.. పిల్లలు లేని తల్లిదండ్రులను గుర్తించి వారికి ఈ చిన్నారులను అమ్మేస్తుంటారు. వారి దగ్గర 4 నుంచి 7 లక్షల వరకు వసూలు చేస్తారు.

 

 గత నెల 27 వ తేదీన అల్వాల్‌లో పసికందు విక్రయానికి సంబంధించిన పక్కా సమాచారం అందడంతో అలెర్ట్‌ అయ్యారు పోలీసులు.. అర్ధరాత్రి రెండు వారాల పసికందును విక్రయిస్తుండగా పట్టుకున్నారు. ఈ ముఠాలోని శమంతకమణి, రేణుకలను అదుపులోకి తీసుకున్నారు.. తీగ లాగితే డొంక కదిలినట్లు మొత్తం ఈ ముఠా వ్యవహారం వెలుగులోకి వచ్చింది.. దర్యాప్తులో భాగంగా దమ్మాయిగూడలో ఉంటున్న బాబురెడ్డి ఇంటికి వెళ్లిన పోలీసులకు, అప్పటికే విక్రయించడానికి సిద్ధంగా ఉన్న మరో చిన్నారి కనపడింది.. వెంటనే ఆ పాపను రెస్క్యూ చేసిన పోలీసులు ముఠాలోని ఏడుగురు సభ్యులను అరెస్టు చేశారు.

 

 గంగాధర్‌రెడ్డిపై మొత్తం తొమ్మిది కేసులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. రెస్క్యూ చేసిన ఇద్దరు పసికందులను సఖీ కేంద్రానికి తరలించారు. బాబురెడ్డి ఇంట్లో దొరికిన పసికందు పేరెంట్స్‌ ఎవరో ఇంకా తెలియట్లేదు. పరారీలో ఉన్న మరో నిందితుడు సీతారాం దొరికితే వివరాలు తెలుస్తాయని పోలీసులు చెప్తున్నారు..

 

మరింత సమాచారం తెలుసుకోండి: