శ్రీ వేంకటేశ్వరుడు కొలువైవున్న తిరుపతిలో నేరాలు, ఘోరాలు సంఖ్య రోజు రోజుకీ పెచ్చిమీరిపోతున్నది. తాజాగా సింగాలగుంటలోని ఆర్ అండ్ బీ గెస్ట్‌హౌస్‌ వద్ద రెండు వర్గాల మధ్య జరిగిన గ్యాంగ్ వార్ కలకలం సృష్టిస్తోంది. అప్పటివరకు ప్రశాంతంగా ఉన్న ఆ ప్రాంతానికి రెండు గ్యాంగ్‌లు సినీఫక్కీల్లో చేరుకున్నాయి. ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటూ విచక్షణా రహితంగా కొట్టుకున్నారు. ఈ ఘటనలో రెండు వర్గాలకు చెందిన నలుగురు గాయపడినట్లు తెలుస్తోంది.
 

ప్రేమ వ్యవహారమే ఈ ఘటనకు కారణమని తెలుస్తోంది. మరోవైపు ఈ తతంగాన్నంతా వీడియో తీసిన కొందరు వ్యక్తులు దాన్ని పోలీసులకు అందజేశారు. దీంతో పోలీసులు రెండు వర్గాలను పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు. రోడ్లపై ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తే ఇకపై ఊరుకునేది లేదని వారికి హెచ్చరించారు. కొంతకాలం క్రితం ప్రశాంతంగా ఉండే తిరుపతి నగరంలో ఇటీవల నేరాల సంఖ్య గణనీయంగా పెరిగిపోతోంది. కొద్ది నెలల క్రితం లీలామహల్‌ సెంటర్‌లో ఓ రౌడీషీటర్‌ను అందరూ చూస్తుండగానే కిరాతకంగా చంపేసిన ఘటన కలకలం రేపింది. ముఖ్యంగా యువకులు గ్యాంగులుగా ఏర్పడి అల్లర్లకు పాల్పడుతున్నట్లు అనేక ప్రాంతాల నుంచి ఆరోపణలు వస్తున్నాయి.

 

అలాగే ఇటీవల తిరుపతిలో చిరువ్యాపారులపై రౌడీ మూకల దాడి చాలా అమానుషమైనది. ఎంతో భక్తితో శ్రీవారి మెట్టుమార్గాన తిరుమలకు నడిచి వెళ్లాలని వచ్చిన భక్తులు రౌడీలు సృష్టించిన అరాచకాలతో భీతావహులయ్యారు. ఎటు వెడుతున్నామో తెలియకుండా పరుగులు తీశారు. శ్రీవారి మెట్టు మార్గంలో భక్తులకు అవసరమైన తినుబండారాలు, నీరు, జ్యూస్ ఇతర ఆహార పదార్థాలను విక్రయిస్తూ తిరుపతి, చంద్రగిరి, పెరుమాళ్లపల్లి తదితర ప్రాంతాలకు చెందిన కొంతమంది చిరువ్యాపారులు జీవనం సాగిస్తున్నారు. 

 

ఈ క్రమంలో తిరుపతికి చెందిన చెంగల్ రెడ్డి అనే వ్యక్తి ఏకంగా 12 దుకాణాలను ఏర్పాటు చేశాడు. అన్ని దుకాణాలను ఏర్పాటు చేసుకుంటే తాము జీవించేది ఎలా అని అక్కడున్న చిరు వ్యాపారులు బుధవారం చెంగల్ రెడ్డిని ప్రశ్నించారు. దీంతో చెంగల్‌రెడ్డి గురువారం ఉ. 9.30 గంటల ప్రాంతంలో సుమారు 30 మంది అనుచరులతో శ్రీవారిమెట్టు మార్గం వద్దకు వెళ్లి అక్కడున్న చిరు వ్యాపారులకు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండా వారి దుకాణాల్లోని వస్తువులను రోడ్డుపై పడేసి అడ్డుపడ్డవారిని చితకబాది యుద్ధ వాతావరణం సృష్టించారు. ఇదేమిటని ప్రశ్నించిన వారిపై పిడిగుద్దుల వర్షం కురిపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: