పెళ్లి వేడుకల్లో హంగు ఆర్భాటాలు, సందడి, విందు వినోదాలు ఎంత కామనో, వివాదాలు గొడవలు కూడా అంతే కామన్‌. దాదాపు ప్రతీ పెళ్లి వేడుకలో చిన్నదో పెద్దదో గొడవ జరుగుతూనే ఉంటుంది. అయితే ఒక్కొసారి గొడవలు శృతిమించుతుంటాయి. అలా శృతిమించి తీవ్ర పరిణామాలకు దారి తీసిన సంఘటనలు కూడా మనం అడపాదడపా చూస్తూనే ఉంటాం.

 

ఇటీవల అలాంటి ఓ సంఘటనే వెలుగులోకి వచ్చింది. పెళ్లి వేడుకలో జరిగిన ఓ చిన్న గొడవతో అలిగిన వరుడు ఏకంగా పెళ్లి మండపం నుంచి పారిపోయాడు. కర్ణాటకలో జరిగిన ఈ సంఘటనకు కారణమైన వివాదం ఎక్కడ మొదలైందో తెలిస్తే ఎవరైనా షాక్‌ అవ్వాల్సిందే. పెళ్లి కూతురి చీర విషయంలో జరిగిన గొడవకే పెళ్లి కొడుకు అలిగి వెళ్లిపోయాడట.

 

వివరాల్లోకి వెళితే.. కర్ణాటక రాష్ట్రంలోని హసన్ జిల్లా బీదరికెరె గ్రామంలో ఈ వింత సంఘటన జరిగింది. గ్రామానికి చెందిన రఘు అదే ప్రాంతానికి చెందిన ఓ అమ్మాయిని ఐదేళ్లుగా ప్రేమిస్తున్నాడు. వీరి సంగతి పెద్దలకు కూడా తెలిసింది. ఇటీవల వీరి ప్రేమను అంగీకరించిన తల్లిదండ్రులు వివాహానికి అన్ని ఏర్పాట్లు చేశారు. ఘనంగా పెళ్లి జరిపించాలని నిశ్చయించారు.

 

పెళ్లి కూతురికి బట్టలు తీసుకునేందుకు వెళ్లేప్పుడు వరుడు రఘును కూడా పిలిచారు, అమ్మాయి అమ్మా నాన్నలు. అయితే షాపింగ్‌కు వెళ్లిన రఘుకు ఓ చీర విపరీతంగా నచ్చింది. ఈ చీర మా ఆవిడకు చాలా బాగుంటుందని, ఆ చీరే తీసుకోవాలని కాబోయే అత్తమామలకు చెప్పాడు. అయితే అమ్మాయి తరుపు వారు మాత్రం రఘు నిర్ణయాన్ని పట్టించుకోకుండా మరో చీరను కొన్నారు.

 

దీంతో అలిగిన రఘు సరిగ్గా పెళ్లి రోజునే కనిపించకుండా పోయాడు. కుటుంబ సభ్యులు ఎంత వెతికిన రఘు జాడ దొరక్కపోవటంతో ఇక పెళ్లి రద్దు చేసుకున్నారు. చిన్న గొడవకే పెళ్లిని ఆపేసిన రఘు మీద వధువు కుటుంబ సభ్యులు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. రఘు కారణంగా మా అమ్మాయి జీవితం నాశనం అయ్యిందని, అతడిని కఠినంగా శిక్షించాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: