అయోధ్యలో రామాలయాన్ని నిర్మించేందుకు త్వరలో పనులు మొదలు పెట్టబోతోంది ఆలయ ట్రస్ట్..! శ్రీరామ జన్మభూమి తీర్ధ క్షేత్ర ట్రస్ట్ ఏప్రిల్ నుంచి పనులు మొదలు పెట్టే ఆలోచనలో ఉంది. విరాళాల సేకరణ , ఆలయ నమూనా.. భక్తుల సౌకర్యాల వంటి వాటిపై ట్రస్ట్ కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది. ఏప్రిల్ 2న శ్రీరామ నవమి కావడంతో అదే రోజు పనులు ప్రారంభం కావొచ్చు.

 

అయోధ్యలో ఆలయ నిర్మాణానికి సంబంధించిన కసరత్తు వేగవంతమైంది. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు కేంద్ర ప్రభుత్వం ట్రస్ట్‌ను కూడా ఏర్పాటు చేయడంతో త్వరలోనే కార్యకలాపాలు ప్రారంభంకాబోతున్నాయి. సీనియర్ అడ్వకేట్ పరాశరన్ చైర్మన్ గా 15 మంది సభ్యులతో కేంద్ర హోం శాఖ ట్రస్ట్‌ను నోటిఫై చేసింది. ప్రయాగ్‌ రాజ్‌లో ట్రస్ట్ తొలి సమావేశం జరుగుతుంది. అయోధ్యలో ఆలయ నిర్మాణాన్ని ఎప్పుడు ప్రారంభించాలనేది తొలి సమావేశంలో నిర్ణయిస్తారు. ఏప్రిల్ 2న శ్రీరామ నవమి.. ఏప్రిల్ 26న అక్షయ తృతీయ..ఈ రెండింటిలో ఏదో ఒక రోజు ఆలయ పనులు ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.

 

అయోధ్యలో రామాలయ నిర్మాణం కోసం తొలి విరాళాన్ని కూడా కేంద్ర ప్రభుత్వమే ప్రకటించింది. ఒక్క రూపాయిని విరాళంగా అందించింది. కేంద్ర ప్రభుత్వం తరపున హోం శాఖ కార్యదర్శి ఈ విరాళాన్ని ట్రస్టు సభ్యులకు అందించారు. ఆలయ నిర్మాణం కోసం నగదు, ఆస్తుల రూపంలో ఎవరు విరాళాలు ఇచ్చినా షరతులు లేకుండా స్వీకరిస్తామని ట్రస్ట్ ప్రకటించింది. అయోధ్యలో ఆలయ నిర్మాణం, నిర్వహణ కోసం ఏదైనా సంస్థల నుంచి రుణాలు తీసుకునే అధికారాన్ని కూడా ట్రస్ట్‌కే కట్టబెట్టింది ప్రభుత్వం.

 

ట్రస్ట్ బాధ్యతలు ఎలా ఉండాలనే అంశానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం 9 నిబంధనలను రూపొందించింది. ట్రస్ట్ శాశ్వత కార్యాలయం ఏర్పాటు, విరాళాల సేకరణ, ఆయన నిర్మాణంపై తుది నిర్ణయం తీసుకోవడం ఇలాంటి ప్రతి అంశానికి ట్రస్ట్‌దే బాధ్యతని స్పష్టం చేసింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఆలయ నిర్మాణాన్ని చేపట్టి...రెండేళ్లలో దాన్ని పూర్తి చేసే విధంగా ప్రణాళికలు రచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: