తెలంగాణ‌లో మునిసిప‌ల్‌, కార్పొరేష‌న్ ఎన్నిక‌లు ముగిశాయి. మ‌రోసారి వార్ వ‌న్‌సైడ్ అయ్యింది. అధికార టీఆర్ఎస్ పార్టీకి తిరుగులేకుండా పోయింది. ఇక ఇప్పుడు సొసైటీ ఎన్నిక‌ల‌కు రంగం సిద్ధ‌మైంది. ఈ నెల‌లో జ‌రిగే సొసైటీ ఎన్నిక‌ల్లో సైతం కారు జోరుకు తిరుగులేద‌ని అర్థ‌మ‌వ‌వుతోంది. ఇక వ‌చ్చే త్వ‌ర‌లోనే తెలంగాణ‌లో మ‌ళ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఆ ఎన్నిక‌ల్లోనూ కారు పార్టీకి బ్రేక్ వేసే సీన్ ఏ పార్టీకి లేదు. దేశ‌వ్యాప్తంగా మార్చిలో చాలా రాజ్య‌స‌భ స్థానాలు ఖాళీ కానున్నాయి.

 

మార్చి రెండున కొన్ని రాజ్య‌స‌భ సీట్లు ఖాళీ కాబోతున్నాయి. మ‌రో రెండు ఎమ్మెల్సీ సీట్లు ఖాళీగా ఉన్నాయి. జూన్‌లో మ‌రో రెండు ఎమ్మెల్సీ స్థానాలు కూడా రెడీ అవుతున్నాయి. ఈ ఆరు స్థానాలు కారు పార్టీకే ద‌క్క‌నున్నాయి. ఇక ఈ ఆరు సీట్ల కోసం ఏకంగా గులాబీ ద‌ళంలో 20 మంది లీడ‌ర్లు పోటీ ప‌డుతున్నారు. ఈసారి త‌మ‌కే ప‌క్కాగా సీటు వ‌స్తుంద‌నే ఆశ‌లో ప‌లువురు నేత‌లు ఉన్నారు.

 

తెలంగాణ కోటాలో ఉన్న రాజ్య‌స‌భ సభ్యులు కేవీపీ, గ‌రిక‌పాటి మోహ‌న్‌ రావుల ప‌ద‌వీకాలం మార్చిలో ముగుస్తోంది. ఇక ప్ర‌స్తుతం ఏపీ కోటాలో రాజ్య‌స‌భ స‌భ్యుడిగా ఉన్న కేశ‌వ‌రావు ప‌ద‌వీ కాలం సైతం మార్చిలోనే ముగియ‌నుంది. ఇక ఇప్పుడు ఈ రెండు రాజ్య‌స‌భ సీట్లు ఎవ‌రికి ఇస్తార‌న్న‌దానిపై పెద్ద చ‌ర్చే న‌డుస్తోంది. ఈ క్ర‌మంలోనే కేసీఆర్ కుమార్తె క‌విత పేరు ప్ర‌ముఖంగా ప్ర‌స్తావ‌న‌కు వ‌స్తోంది.

 

గ‌తేడాది జ‌రిగిన ఎన్నిక‌ల్లో నిజామాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన త‌ర్వాత రాజ‌కీయంగా క‌విత చాలా సైలెంట్ అయ్యార‌న్న‌ది వాస్త‌వం. క‌విత ఎంపీగా ఉన్న‌ప్పుడు తెలంగాణ రాజ‌కీయాల్లో చాలా క్రియాశీల‌క పాత్ర పోషించేవారు. ఎన్నిక‌ల్లో ఓట‌మి త‌ర్వాత ఆమెకు ఏదో ప‌ద‌వి వ‌స్తుంద‌న్న ఆశ‌తో ఉన్నా కేసీఆర్ ఆ దిశ‌గా దృష్టి పెట్ట‌క‌పోవ‌డంతో ఆమె అల‌క‌బూనిన‌ట్టు కూడా పార్టీలో ప్ర‌చారం జ‌రిగింది.

 

రాజ్య‌స‌భ సీటు కోసం కొంత‌కాలంగా ఆమె అల‌క వ‌హించార‌ని గులాబీ వ‌ర్గాలు అంటున్నాయి. ఇక రెండు రాజ్య‌స‌భ సీట్ల‌లో ఒక‌టి ఆమెకు లేదా ఓ రెడ్డికి…మ‌రొక‌టి ఎస్సీకి సీటు ఇస్తార‌ని తెలుస్తోంది. ఇప్ప‌టివ‌ర‌కూ బీసీ వ‌ర్గాలు, ఇత‌ర వ‌ర్గాల‌కు టికెట్లు అందాయి. రాజ్య‌స‌భ కోటాలో రెడ్డి, ఎస్సీ వ‌ర్గానికి సీటు ద‌క్క‌లేదు. అదే జ‌రిగితే క‌విత తెలంగాణ పొలిటిక‌ల్ తెర‌పై మ‌ళ్లీ సత్తాచాట‌డం ఖాయ‌మే.

మరింత సమాచారం తెలుసుకోండి: