జనసేనాని పవన్ కళ్యాణ్ మకాం మార్చేశారు. గత యేడాది కాలంగా పవన్ ఏపీలో చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ఎన్నికలకు ముందు ఏపీలో పశ్చిమగోదావరి జిల్లాలోని ఏలూరులో పవన్ ఓటు హక్కు నమోదు చేయించుకున్నారు. తాను గెలిచినా.. ఓడినా ఏపీలోనే మకాం ఉంటానని.. ఏపీలో ప్రజల పక్షాన పోరాటం చేస్తానని.. అసలు తనకు సీఎం పీఠం టార్గెట్టే కాదని ఏవేవో కబుర్లు చెప్పాడు. అటు ఏపీ జనాలు కూడా సీఎం పీఠంపై ఆశ లేనప్పుడు కనీసం నీకు అసెంబ్లీలో ఉండే అర్హత కూడా లేదని అనుకున్నారో ఏమో గాని ఎన్నికల్లో అటు సొంత జిల్లా భీమవరంలోనూ..ఇటు విశాఖ జిల్లాలోని గాజువాకలోనూ చిత్తు చిత్తుగా ఓడించేశారు.
పార్టీ పెట్టిన ఆరేళ్లలో పవన్ కనీసం ఎమ్మెల్యేగా కూడా విజయం సాధించలేకపోయారు. చివరకు రాజోలులో ఒక్క సీటుతోనే సరిపెట్టుకోగా.. ఆ ఎమ్మెల్యే కూడా పవన్ మాట వినే పరిస్థితి లేదు. ఇది పవన్ ఆరేళ్లలో సాధించిన రాజకీయం. ఎన్నికల్లో ఓటమి తర్వాత ఎక్కువుగా హైదరాబాద్‌కే పరిమితమైన పవన్ ఇప్పుడు మళ్లీ సినిమాల్లో నటించేందుకు రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం పింక్ సినిమా రీమేక్‌లో నటిస్తోన్న పవన్ ఈ సినిమా తర్వాత వరుసగా క్రిష్, హరీష్ శంకర్ డైరెక్ట్ చేసే సినిమాలకు ఓకే చెప్పినట్టు టాక్.
సినిమాల్లో నటించను.. ప్రజల కోసమే.. ప్రజా పోరాటాలే అని చెప్పి మాట మార్చేసినట్టుగానే పవన్ ఏపీ జనాలను గాలికొదిలేసి హైదరాబాద్‌కు మకాం మార్చేశాడు. వరుస సినిమా షూటింగ్‌ల బిజీతో పవన్ ఇక అప్పుడప్పుడు మాత్రమే ఏపీకో లేదా అమరావతికో వెళ్లనున్నారు. పార్టీ బాధ్యతలు మొత్తం నాదెండ్ల మనోహర్‌కు అప్పగించేశారట. ఇటీవల జిల్లాల నాయకులతో పవన్ సమావేశాలు నిర్వహిస్తున్నారు. తాజాగా కర్నూలు జిల్లా జనసేన నాయకులు, కార్యకర్తలతో సమావేశాన్ని హైదరాబాద్ లో నిర్వహించనున్నట్టు చెప్పారు.
అయితే..గియితే ఏపీ పార్టీ కార్యకలాపాలు అమరావతిలో పెట్టాలి.. లేదా కర్నూలు జిల్లా సమావేశాలు అయితే కర్నూలులోనే పెట్టాలి... మరి ఇప్పుడు హైదరాబాద్‌కు మార్చేశారంటేనే పవన్ తన మకాంను మెల్లిమెల్లిగా అమరావతి నుంచి హైదరాబాద్ కు మారుస్తున్నట్టు అర్థమవుతోంది. దీనికి రెండు కారణాలు చెబుతున్నారు. అమరావతికి మద్దతు ఇచ్చిన పవన్ కర్నూలు వెళితే అక్కడ నిరసనలు తప్పవు. ఇలా వైజాగ్‌కు వెళ్లినా తరిమి కొట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇక పవన్‌ను నమ్ముకున్న నాయకులు అంతా ఆయన సినిమాల పాటలు పాడుకోవడం తప్పా చేసేదేం ఉండదు. అందుకే పవన్ హైదరాబాద్‌లో సమావేశాలు పెట్టుకుంటున్నారని టాక్? ఏదేమైనా పవన్ తనకున్న పార్ట్ టైం పొలిటిషీయన్ బిరుదును మరోసారి ఫ్రూవ్ చేసుకున్నట్లయ్యింది.