ట్రాఫిక్ పోలీసులు ఎక్కువగా ప్రైవేట్ వాహనాలకు, బైక్ లకు, కార్లకు ఫైన్లు వేస్తూ ఉండటం తరచుగా చూస్తూనే ఉంటాం. కొన్నిసార్లు ఆర్టీసీ బస్సులు నిబంధనలకు విరుద్ధంగా వెళుతున్నా ట్రాఫిక్ పోలీసులు పట్టించుకోరని విమర్శలు వ్యక్తమవుతూ ఉంటాయి. కానీ ఈ మధ్య కాలంలో ట్రాఫిక్ పోలీసులు ప్రభుత్వ రంగ వాహనాల విషయంలో కూడా దృష్టి పెడుతూ నిబంధలను విరుద్ధంగా వాహనాలను నడిపితే ఫైన్లు వేస్తున్నారు. 
 
ట్రాఫిక్ పోలీసులు ఈరోజు నిబంధనలకు విరుద్ధంగా వెళుతున్న ఒక ఆర్టీసీ బస్సు డ్రైవర్ కు ఫైన్ వేశారు. హైదరాబాద్ నగరంలోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. AP 28 Z 1220 నంబర్ గల బస్సు జగద్గిరి గుట్ట నుండి బయలుదేరి పంజాగుట్ట మీదుగా మెహిదీపట్నం వెళుతున్న సమయంలో డ్రైవర్ అతి వేగంతో బస్సును నడుపుతున్నట్టు ట్రాఫిక్ పోలీస్ గుర్తించాడు. 
 
వెంటనే ఆర్టీసీ బస్సును ఆపి ట్రాఫిక్ పోలీసులు డ్రైవర్ సురేందర్ రెడ్డికి బస్సును అతివేగంగా నడపవద్దని సూచించారు. ఆ తరువాత నిబంధనలు ఉల్లంఘించినందుకు 1000 రూపాయలు జరిమానా చెల్లించాలని డ్రైవర్ కు తెలిపారు. పోలీసులు ట్రాఫిక్ నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించాల్సిందేనని పాటించని పక్షంలో ఎంతటి వారైనా చర్యలు తీసుకుంటామని చెప్పారు. 
 
గతంలో కూడా ట్రాఫిక్ పోలీసులు వేగంగా వాహనాలు నడిపినా, నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు నడిపినా పలు ప్రభుత్వ వాహనాలకు ఫైన్లు విధించటం తెలిసిందే. ట్రాఫిక్ పోలీసులు వేగంగా ఆర్టీసీ బస్ నడుపుతున్న డ్రైవర్ కు ఫైన్ విధించటం పట్ల ప్రయాణికుల నుండి హర్షం వ్యక్తం అవుతోంది. ట్రాఫిక్ పోలీసులు నిబంధనలు పాటించని వారిపై తగిన చర్యలు తీసుకుంటే ప్రమాదాలు కూడా తగ్గే అవకాశం ఉంది. నిబంధనలు పాటించిన వారికి జరిమానాలు విధిస్తూ తప్పు చేస్తే బాదుడే అని ట్రాఫిక్ పోలీసులు వాహనదారులను పరోక్షంగా హెచ్చరిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: