ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి సార‌థ్యంలోని స‌ర్కారు పెద్ద ఎత్తున పెన్ష‌న్లు మంజూరి చేసిన సంగ‌తి తెలిసిందే. నవశకం సర్వే లో ప్రతి ఒకరి అర్హతలను నిర్ధారణ చేసుకొని ఈనెలలో మొత్తం 54.68 లక్షల మందికి 1వ తారీఖునే పింఛన్ పంపిణీ చేశారు. వాలంటీర్ల ద్వారా మొత్తం రూ.1320 కోట్లను లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి చేతికి ప్రభుత్వం అందించింది.  సుమారు 87శాతం పెన్షన్లను ఈ నెల 1వ తేదీనే పంపిణీ చేసి పెన్షన్ల పంపిణీలో ప్రభుత్వం రికార్డు సృష్టించింది. అయితే, కొంద‌రికి దుర‌దృష్ట‌వ‌శాత్తు పెన్ష‌న్‌లు రాలేదు. దీనిపై ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.

 


ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ మేర‌కు ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. `` నవశకం సర్వే ద్వారా రాష్ట్రంలో అర్హులైన పెన్షనర్ల గుర్తింపు జ‌రిగింది. కొత్తగా ఈ నెలలో 6.14 లక్షల మందికి పెన్షన్ల మంజూరు. అర్హత లేని కారణంగా 4.80 లక్షల మందికి పెన్షన్ తొలగింపు జ‌రిగింది. సంతృప్తిస్థాయిలో వైఎస్ఆర్ పెన్షన్ కానుకను అమలు చేయాలని ప్రభుత్వ లక్ష్యం.  అర్హులైన వారికి పెన్షన్ అందకపోతే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం తొలగించిన పెన్షన్లపై కూడా సమగ్ర పరిశీలన చేయిస్తాం.  అర్హత వున్న ప్రతి ఒక్కరికీ పెన్షన్ అందుతుందని సీఎం వైఎస్ జగన్ భ‌రోసా ఇస్తున్నారు. నేరుగా అధికారులే ఇళ్ళ వద్దకు వచ్చి దరఖాస్తుదారుల అర్హతలను పరిశీలిస్తారు.`` అని హామీ ఇచ్చారు.

 

 పూర్తి పారదర్శకతతో పెన్షన్లను ఈ ప్రభుత్వం మంజూరు చేస్తోందని మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు. ``కులం, మతం, ప్రాంతం, రాజకీయాలతో సంబంధం లేకుండా అర్హత వుంటే చాలు.  సుమారు 31,672 మంది దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు పింఛన్లు ఇచ్చాం.  కేటగిరిల వారీగా రూ.3వేలు, రూ.5వేలు, రూ.10వేల చొప్పున పెన్షన్ అందించాం.  అంతే కాకుండా అర్హులందరికీ లబ్ది చేకూర్చాలనే ఉద్దేశంతో గతం కన్నా మార్గదర్శకాలను కూడా సరళతరం చేశాం.  వయో పరిమితిని 65 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలకు తగ్గించాం.  గత ప్రభుత్వం ఇస్తున్న పెన్షన్ ను రూ.వెయ్యి నుంచి రూ.2,250లకు పెంచాము. పెన్షన్ తీసుకుంటున్న వారిలో ఆనందాన్ని నింపుతున్నాం. ప్రతి ఏటా రూ.250 ల చొప్పున రూ.3,000లకు వరకు పింఛన్లను పెంచుతామని సీఎం వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. నిరుపేద కుటుంబానికి 3 ఎకరాల లోపు మగాణి లేదా 10 ఎకరాల లోపు మెట్టా లేదా రెండు కలిపి 10 ఎకరాల లోపు వున్న వారికి కూడా పింఛన్లకు అర్హత కల్పించాం. దివ్యాంగులకు వారి వైకల్యం శాతంతో సంబంధం లేకుండా 40 శాతం పైబడిన వారందరికీ రూ.3వేలు పెన్షన్ ఇస్తున్నాము. దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు వున్న కుటుంబంలో అర్హత వున్న వారికి రెండో పెన్షన్ ఇచ్చే వెసులుబాటు కల్పించాం. `` అని మంత్రి వెల్ల‌డించారు.

 

కుటుంబ ఆదాయ పరిమితి గ్రామీణ ప్రాంతాలలో నెలకు రూ.10వేలు, పట్టణ ప్రాంతాలలో రూ. 12వేలకు పెంచిన విష‌యాన్ని మంత్రి ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు. ``టాక్సీ, ట్రాక్టర్, ఆటో లకు నాలుగు చక్రాల వాహన పరిమితి నుంచి మినహాయింపు ఇచ్చాం. అభయహస్తం పెన్షన్ తీసుకునేవారికి అర్హతను బట్టి వృద్ధాప్య పెన్షన్ మంజూరు చేస్తున్నాం. మున్సిపల్ ఏరియాలో వెయ్యి చదరపు అడుగుల నివాసం వున్న వారికి కూడా పెన్షన్ ఇస్తున్నాం. కుటుంబ నెలసరి విద్యుత్ వినియోగం 300 యూనిట్లల వరకు మినహాయింపు ఇచ్చాం. లబ్ధిదారుల కుటుంబం ఆదాయపన్నులో వుండరాదు. కుటుంబంలో ఏ ఒక్కరు అయినా ప్రభుత్వ ఉద్యోగి, పెన్షన్ దారు అయి వుండరాదు.  బహుళ అంగవైకల్యం గల కుష్ఠి వ్యాధి గ్రస్తులకు ప్రతి నెల రూ.3వేలు పెన్షన్ ఇస్తున్నాం. ద్వైపాక్షిక వ్యాధి, చక్రాల కుర్చి, మంచానికే పరిమితమైన పక్షవాతం, కండరాల వ్యాధి, ప్రమాద బాధితులు, దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధిగ్రస్తులు, లివర్, కిడ్నీ, గుండె మార్పిడీ చేయించుకున్న వారికి ప్రతినెలా రూ.5 వేల పెన్షన్ ఇస్తున్నాం. డయాలసీస్, తలసేమియా, సికిల్ సెల్, తీవ్రమైన హిమోఫీలియా వ్యాధిగ్రస్తులకు ప్రతినెలా రూ.10వేలు పెన్షన్ ఇస్తున్నాం. అర్హులైన ప్రతి ఒక్కరికీ పెన్షన్ ఇవ్వాలనేదే మా ప్రభుత్వ ఉద్దేశం. అర్హతగల వారు ఎవరైనా పెన్షన్‌ కోసం సంబంధిత గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకున్న 5 రోజుల్లో పెన్షన్ మంజూరు చేస్తాం.`` అని వెల్ల‌డించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: