చైనాలోని వూహాన్ లోని కర్నూలు జిల్లా యువతికి ఇంకా విముక్తి లభించలేదు. కరోనా వైరస్ విలయతాండవం చేస్తున్న వూహాన్ లో టీసీఎల్ కంపెనీ శిక్షణ కోసం వెళ్లి అక్కడే చిక్కుకుంది అన్నెం జ్యోతి. జ్యోతితోపాటు అక్కడకు వెళ్లిన 56 మందిని ప్రత్యేక విమానంలో భారత్ కు తీసుకువచ్చినా,  జ్యోతికి టెంపరేచర్ ఎక్కువగా ఉండడంతో విమాన ప్రయాణానికి అనుమతించలేదు. వారం రోజులుగా వూహాన్ లోని ఓ పెద్ద డార్మెటరీలో జ్యోతి ఒక్కరే పడిగాపులు పడుతోంది. 

 

చైనాలోని వూహాన్ అంతా కరోనా వైరస్ భయానక వాతావారణాన్ని సృష్టిస్తోంది. ఇళ్లలో నుంచి ఎవరూ బయటకు రావడానికి కూడా  సాహసం చేయడం లేదు. ఆలాంటి చోట అన్నెం జ్యోతి ఒక్కతే ఒక పెద్ద డార్మెటరీలో ఉంది. ఎప్పుడు భారత్ కు పంపుతారా అని ఎదురు చూస్తూ ఉంది. ప్రతి రోజు ఎంబసీ అధికారులు మాట్లాడుతున్నా జ్యోతిని ఎప్పుడు భారత్ కు తీసుకువచ్చేదీ చెప్పడం లేదు. వారం రోజులుగా జ్యోతి నరకయాతన అనుభవిస్తోంది. 

 

తనకు ఎలాంటి కరోనా లక్షణాలు లేవు బాబోయ్ అంటున్నా చైనా అధికారులు ఎవరూ పట్టించుకోవడం లేదు. ఇప్పటికే రెండు సార్లు జ్యోతి తన బాధను వెళ్లగక్కుతూ వీడియో పంపింది. తనకు కనీస వైద్య పరీక్షలు కూడా చేయడం లేదని, ఆరోగ్యం నిలకడగా ఉందని జ్యోతి చెబుతున్నా వినే నాథుడు లేడు. కనీసం తనను వూహాన్ నుంచి రక్షిత ప్రాంతానికి తీసుకువెళ్లాలని కోరుతోంది జ్యోతి. 

 

జ్యోతి తల్లి ప్రమీల, కాబోయే భర్త అమరనాథ్ రెడ్డి కర్నూలు జిల్లాలో జ్యోతి రాక కోసం ఎదురుచూస్తున్నారు. జ్యోతిని వెంటనే ఇండియా తీసుకువచ్చే ఏర్పాట్లు చేయాలని ఇప్పటికే ఎంపి టిజి వెంకటేష్ విదేశీ వ్యవహారాల మంత్రి జైశకంర్ ను కోరారు. మరోవైపు క్షేమంగా రావాలని జ్యోతి తల్లి, కాబోయే భర్త మహానందిలో యాగం చేశారు. 

 

మాజీ మంత్రి భూమా అఖిల జ్యోతి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. భూమా అఖిల పరామర్శిస్తుండగా జ్యోతి తల్లి ప్రమీలా అస్వస్థతకు గురయ్యారు. బిపి పడిపోయి సొమ్మసిల్లిపోయారు. ఎలాగైనా జ్యోతిని రప్పించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించాలని జ్యోతి బంధువులు, గ్రామస్తులు కోరుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: