నగరి...మొదట నుంచి టీడీపీకి పెద్ద అనుకూలమైన నియోజకవర్గం ఏమి కాదు. ఆ పార్టీ ఆవిర్భావించిన దగ్గర నుంచి ఇక్కడ రెండుసార్లు మాత్రమే గెలిచింది. 1994, 2009 ఎన్నికల్లో మాత్రమే గెలిచింది. మిగతా అన్నిసార్లు కాంగ్రెస్ గెలిచింది. ఇక 2014 ఎన్నికల నాటి నుంచి అయితే నియోజకవర్గం వైసీపీకి అనుకూలంగా వెళ్లింది. 2014లో వైసీపీ నుంచి రోజా, టీడీపీ సీనియర్ నేత గాలి ముద్దుకృష్ణమనాయుడుపై 858 ఓట్ల స్వల్ప మెజారిటీతో గెలిచారు.

 

తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన రోజా, ప్రతిపక్షంలోనే కూర్చున్నారు. టీడీపీ అధికారంలో ఉండటంతో ఆమెకు కాస్త ఇబ్బందికర పరిస్థితులే వచ్చాయి. అయినా సరే వాటిని ఎదురుకుని ఆమె నిలబడ్డారు. ఐదేళ్లు టీడీపీపై పోరాటం చేశారు. అయితే ఇలా రోజా...ప్రతిపక్షంలో ఉండగానే నియోజకవర్గంపై మరింత పట్టు పెంచుకుంటూ వచ్చారు. ఈ క్రమంలోనే గాలి ముద్దుకృష్ణమనాయుడు చనిపోవడంతో టీడీపీకి నాయకత్వ కొరత వచ్చింది.

 

ఇదే అంశం రోజాకు బాగా కలిసొచ్చింది. ఒకవేళ ముద్దుకృష్ణమనాయుడు ఉంటే 2019 ఎన్నికల్లో పరిస్తితి కాస్త వేరుగానే ఉండేది. కానీ ఆయన లేకపోవడం గాలి కుమారులు నగరి టికెట్ కోసం కొట్లాడుకోవడం, ఫైనల్ గా గాలి పెద్ద కుమారుడు భాను ప్రకాశ్ టికెట్ దక్కించుకోవడం జరిగాయి. అయితే భాను పోటీకి దిగిన, అతనికి కుటుంబం నుంచి మద్ధతు దొరకలేదు. పైగా నియోజకవర్గంలో టీడీపీ కేడర్‌ని సమన్వయం చేసుకోలేకపోయారు. ఫలితంగా ఎన్నికల్లో రోజాపై 2700 ఓట్లతో ఓడిపోయారు.

 

ఇక టీడీపీకి ఎదురైన ఓటమి తర్వాతే రోజాకు మరింత అడ్వాంటేజ్ పెరిగింది. పైగా ఆమె అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉండటం బాగా కలిసొచ్చింది. ఓ వైపు టీడీపీ కేడర్‌ని తనవైపు తిప్పుకుంటూనే, నియోజకవర్గంలో పలు అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళుతున్నారు. తాను ప్రోఫిషనల్ పరంగా ఎంత బిజీగా ఉన్న నియోజకవర్గాన్ని మాత్రం వదలడం లేదు. ఎప్పుడు ఏదొక కార్యక్రమం చేస్తూ, ప్రజలకు అండగా ఉంటున్నారు. ప్రజా సమస్యలు పరిష్కరించడంలో ఉంటున్నారు. ఈ విధంగా రోజా దూసుకెళ్లడంతో నగరిలో టీడీపీ ఎన్నికల నుంచి కోలుకోలేదు. ఇక భవిష్యత్‌లో కూడా కోలుకుంటుందనే గ్యారెంటీ లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: