2019 ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయిన దగ్గర నుంచి అధినేత చంద్రబాబుకు ఓ భుజంగా అచ్చెన్నాయుడు ఉంటే, మరొక భుజంగా నిమ్మల రామానాయుడు ఉంటున్నారు. అధినేత ఎలాంటి ఆదేశాలు జారీ చేసిన వీరిద్దరు మాత్రం తూచా తప్పకుండా పాటిస్తున్నారు. జగన్ ప్రభుత్వంపై బాబు పోరాటం చేస్తుంటే దానికి ఫుల్ సపోర్ట్‌గా ఉంటున్నారు. అటు అసెంబ్లీలో గానీ, ఇటు బయట గానీ వీరి గళం గట్టిగా వినిపిస్తున్నారు. అయితే ఇంతలా అధినేతకు విశ్వాసపాత్రులుగా ఉన్న వీరిద్దరిలో నిమ్మల రామానాయుడు కాస్త అటు ఇటు అయ్యే అవకాశముందని తెలుస్తోంది.

 

నియోజకవర్గంలో పరిస్థితుల దృష్ట్యా ఈయన చంద్రబాబుకు ఏదొకరోజు పెద్ద షాకే ఇస్తారని చర్చలు నడుస్తున్నాయి. ఈయన ప్రాతినిధ్యం వహిస్తున్న పాలకొల్లు మొదట నుంచి టీడీపీకి కంచుకోటగా ఉంటూ వస్తుంది. ఆ పార్టీ 1989, 2009 ఎన్నికల్లో తప్ప మిగతా అన్నీ ఎన్నికల్లో విజయం సాధించింది. ఇక 2014, 2019 ఎన్నికల్లో నిమ్మల వరుసగా టీడీపీ నుంచి గెలిచారు. ఐదేళ్లు అధికారంలో ఉన్నప్పుడూ మరీ అంతగా హైలైట్ కాని నిమ్మల, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రం బాగా హైలైట్ అయ్యారు. ఈ 8 నెలల కాలంలోనే ఆయన టీడీపీలో ప్రధాన నేతగా మారిపోయారు.

 

అయితే పార్టీలో ఈయనకు ఎలాంటి ఇబ్బందిలేకపోయినా, నియోజకవర్గంలో మాత్రం కాస్త ఇబ్బందికర పరిస్తితులే ఉన్నాయట. మామూలుగానే ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉండటం వల్ల నియోజకవర్గంలో పెద్దగా పనులు చేయలేకపోతున్నారట. ఇదే సమయంలో వైసీపీ ఇన్ చార్జ్ మాత్రం అధికారంతో ప్రజలకు పనులు చేసి పెడుతున్నారట. అటు ప్రజలు కూడా వైసీపీ నేత వద్దకే వెళుతున్నారట. దీంతో నిమ్మల ప్రాధాన్యత తగ్గుతూ వస్తుంది. ఈ పరిస్తితి ఇలాగే కొనసాగితే భవిష్యత్ ఎన్నికల్లో ఇబ్బందులు వచ్చే అవకాశముందని అంచనా వేస్తున్నారు.

 

దీంతో వైసీపీలోకి వెళితే ఎలాంటి ప్రాబ్లం ఉండదని అనుకుంటున్నట్లు తెలిసింది. కాని నమ్ముకున్న పార్టీని వదిలి వెళ్ళడం ఆయనకు అసలు ఇష్టం లేదని అంటున్నారు. మరి చూడాలి నిమ్మల ఈ నాలుగేళ్ళు ఎలాగోలా బండి లాగేస్తారో? లేక ఫ్యాన్ గాలి కోసం వెళ్లిపోతారో? 

మరింత సమాచారం తెలుసుకోండి: