దివంగత నేత, మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత ఏపీలో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయిన విషయం తెలిసిందే. వైఎస్సార్ హఠాత్తు మరణం, పలువురు అభిమానులు చనిపోవడం, వారిని ఓదార్చేందుకు జగన్‌కు కాంగ్రెస్ అధిష్టానం పర్మిషన్ ఇవ్వకపోవడం, వెంటనే జగన్ కాంగ్రెస్ నుంచి బయటకొచ్చి వైఎస్సార్సీపీ స్థాపించడం జరిగిపోయాయి. ఇక తర్వాత ఎలాంటి పరిణామాలు జరిగాయో అందరికీ తెలిసిందే. అయితే వైసీపీ పెట్టినప్పుడు జగన్‌కు ఇద్దరు సీనియర్ నేతలు గట్టి సపోర్ట్ ఇచ్చారు.

 

విశాఖపట్నంకు చెందిన సబ్బం హరి, కొణతాల రామకృష్ణలు జగన్ వెన్నంటే నడిచారు. కాకపోతే తర్వాత ఊహించని విధంగా ఈ ఇద్దరు వైసీపీ నుంచే సస్పెండ్ అయి బయటకొచ్చారు. ఇక ఎప్పుడైతే వైసీపీ నుంచి సస్పెండ్ అయ్యారో, అప్పటి నుంచి వీరి రాజకీయ భవిష్యత్ ఆగమ్యగోచరంగా మారిపోయింది. సబ్బం హరి 2014 ఎన్నికలకు ముందు కిరణ్ కుమార్ రెడ్డి జై సమైక్యాంధ్ర పార్టీలో చేరి విశాఖపట్నం ఎంపీగా పోటీలోకి దిగి, తర్వాత వైఎస్ విజయమ్మని ఓడించాలనే లక్ష్యంతో పోటీ నుంచి తప్పుకున్నారు.

 

ఆయన అనుకున్నట్లే విజయమ్మ ఓడిపోయారు గానీ...ఈయనకు మాత్రం రాజకీయ భవిష్యత్ లేకుండా పోయింది. కాకపోతే అప్పుడు అధికారంలో ఉన్న టీడీపీకి మాత్రం భజన చేశారు. దీంతోనే చంద్రబాబు పిలిచి మరి 2019 ఎన్నికల్లో భీమిలి ఎమ్మెల్యే టికెట్ ఇస్తే అక్కడ పోటీ చేసి ఓడిపోయారు. ఇక ఓడిపోయాక అప్పుడప్పుడు మీడియా ముందుకొచ్చి, జగన్ ప్రభుత్వంపై విష ప్రచారం చేసి వెళ్లిపోతున్నారు.

 

సబ్బం అప్పుడప్పుడన్న కనిపిస్తున్నారేమో గానీ, కొణతాల మాత్రం కంటికి కనపడట్లేదు. 2019 ఎన్నికలకు ముందు ఈయన జగన్‌తో భేటీ అయ్యి వైసీపీలో చేరడానికి ప్రయత్నాలు చేశారు. అప్పటికే కొణతాల టీడీపీతో టచ్ లో ఉన్నారని తెలిసి, జగన్ కొణతాలని పార్టీలోకి ఆహ్వానించలేదు. అటు టీడీపీలో కూడా ఈయన చేరలేదు. కాకపోతే ఎన్నికల్లో టీడీపీకి సపోర్ట్ చేసినట్లు తెలిసింది. అయితే టీడీపీ ఓడిపోయాక ఈయన అడ్రెస్ లేకుండా వెళ్ళిపోయారు. ఇప్పటివరకు కనిపించిన దాఖలాలు లేవు. మొత్తానికి ఒకప్పుడు జగన్‌కు సపోర్ట్ ఇచ్చిన ఈ ఇద్దరు ఇప్పుడు రాజకీయాల్లో అడ్రెస్ లేనివారిగా అయిపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి: