అమెరికా వరుసగా టార్గెట్ లను ఫినిష్‌ చేస్తోందా? జరుగుతున్న పరిణామాలు అవే సంకేతాలిస్తున్నాయి. గతంలో ఇరాన్‌ నేత సులేమానీని చంపిన అమెరికా, లేటెస్ట్‌ గా  మరో కీలక ఉగ్రవాద నేతను హతమార్చింది. అల్‌ ఖైదా నాయకుడు ఖాసీం అల్-రైమీని అంతం చేసింది. అమెరికాలో నావికా స్థావరంపై జరిగిన కాల్పులకు తామే కారణమని ప్రకటించిన కొన్ని రోజులకే ఈ పరిణామం చోటుచేసుకుంది. 

 

అమెరికా హిట్ లిస్ట్ కంప్లీట్ చేస్తోంది. సైలెంట్ గా తన స్కెచ్ అమలు చేస్తూ అడ్డున్న వారినందర్నీ ఒక్కొక్కర్నీ లేపేస్తోంది. ముఖ్యంగా ఈ ఏడాది తన టార్గట్స్ ఫినిష్ చేయటంలో దూకుడుగా ఉందని స్పష్టమవుతోంది. గత నెల ఇరాన్ ఖుద్స్ ఫోర్స్ కమాండర్ సులేమానీని డ్రోన్ దాడిలో మట్టుబెట్టిన అగ్రరాజ్యం ఇప్పుడు అల్ ఖైదా అగ్రనాయకుడు ఖాసీం అల్-రైమిని లక్ష్యంగా చేసుకుంది. అమెరికా నిఘా సంస్థ సీఐఏ డ్రోన్లు కొన్ని రోజుల కిందటే రైమిని హతమార్చాయి. కానీ ఈ విషయాన్ని నిఘా వర్గాలు గోప్యంగా ఉంచాయి. రైమిని తాము చంపినట్టు, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గురువారం ప్రకటించారు. సెనెట్లో అధ్యక్షుడిపై అభిసంశన ఓటింగ్‌ కు కొన్ని రోజుల ముందు ఈ దాడి జరగటం ఆసక్తిగా మారింది.

 

వాళ్ల పేర్లు ప్రపంచానికి పెద్దగా తెలియవు.. కానీ, రాజకీయాల్లోనో, తమ సైన్యాలను నడిపించటంలోనో కీలక వ్యక్తులు. సులేమాని అయినా, రైమి అయినా..ఇద్దరూ విజయవంతమైన వ్యూహకర్తలు. అమెరికా కంట్లో నలుసుగా మారిన వారు. రైమి అల్-ఖైదా అరేబియా ద్వీపకల్ప విభాగానికి నాయకత్వం వహిస్తున్నాడు. 1990 నుంచి ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడు. ముఖ్యంగా అమెరికా సైనిక స్థావరాలు, దౌత్యకార్యాలయాలపై జరిగిన భారీ దాడుల్లో, దౌత్య అధికారి హత్య కుట్రల్లో రైమి హస్తం ఉంది. ఇతని సమాచారం అందజేస్తే 10 మిలియన్ డాలర్లు బహుమతిగా ఇస్తామని అమెరికా ప్రకటించింది. 

 

రైమిని మట్టుబెట్టాలనే అమెరికా ఆలోచన ఇప్పటిది కాదు. కొన్నేళ్ల క్రితమే ప్రణాళికలు రచించింది. కానీ అతని ఆచూకీ కచ్చితంగా కనుక్కోలేకపోయింది. దీనికోసం నేవీ సీల్స్ కు చెందిన టీమ్ 6ను రంగంలోకి దింపినా సక్సెస్ అవలేకపోయారు. కానీ, 2019 డిసెంబరు 6న ఫ్లోరిడాలో అమెరికా నావికాదళ స్థావరంలో భారీ ఎత్తున జరిగిన దాడి వెనుక రైమి ఉన్నాడని తేలటంతో ఎలాగైనా అంతం చేయాలని నిర్ణయించింది అమెరికా. రైమి సమాచారం తెలుసుకున్న అమెరికా అతడి కదలికలపై కొన్ని నెలల క్రితమే నిఘా పెట్టింది. గత నవంబర్లో రైమి స్థావరంపై కీలక సమాచారాన్ని ఒక ఇన్ఫార్మర్ నుంచి అమెరికా అందుకొంది. ఇప్పుడు  జరిగిన డ్రోన్ దాడిలో రైమి హతమైనా, బయటికి వెల్లడించటానికి ఆలస్యం చేసింది. ఈ ఆపరేషన్ తో అల్ఖైదా కార్యకలాపాలపై తీవ్ర ప్రభావం పడుతుందని భావిస్తున్నామని, వైట్ హౌస్  విడుదల చేసిన ప్రకటనలో ట్రంప్ వెల్లడించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: