కాంగ్రెస్‌కు కాలం కలిసి రావడం లేదు. ఎన్నికలేవైనా.. అధికార పార్టీతో  ఢీ కొట్టలేకపోతోంది. పార్లమెంట్ ఎన్నికల్లోనే కాస్త పోటీ ఇవ్వగలిగినా.. ఈలోపే బీజేపీ పక్కలో బల్లెంలా మారిపోయింది. మున్సిపల్ ఎన్నికల్లో కూడా కొంత ప్రభావం చూపగలిగినా.. అదీ అంతంత మాత్రమే. ఇప్పుడు మళ్లీ సహకార ఎన్నికలు ముందుకు వచ్చినా..  కాంగ్రెస్ పార్టీ అంత సీరియస్ గా తీసుకుంటున్నట్టు కనిపించడం లేదు. 

 

ఎన్నికలంటే.. డబ్బులు ఖర్చు చేయడమేనన్న నిర్ణయానికి వచ్చేసినట్టుంది కాంగ్రెస్‌ పార్టీ. ఒకవేళ డబ్బులు ఖర్చు చేసినా గెలుస్తామో లేదోనన్న భయమూ వెంటాడుతోంది. అన్ని ఎన్నికలూ ఒకెత్తయితే.. సహకార ఎన్నికలు మరో సవాల్. వీటిని కాంగ్రెస్ అంతగా సీరియస్ గా భావించడం లేదని తెలుస్తోంది. నామినేషన్ ఘట్టం కూడా ముగింపు దశకు చేరినా.. ఆ పార్టీకి వ్యూహరచన చేయలేదు. పీసీసీ చీఫ్ ఉత్తమ్.. తన నివాసంలో సీనియర్ నాయకులతో ఒక సమావేశం నిర్వహించి మమ అనిపించినట్టుంది. 

 

ఈ సహకార ఎన్నికలు 34 లక్షల మంది రైతులకు సంబందించిన వ్యవహారం. ఇప్పటికే అధికార పార్టీ.. రైతులంతా తమవైపే ఉన్నారని చబుతోంది. కాంగ్రెస్ ఏమో ... కేసీఆర్ ప్రభుత్వం రైతులను మోసం చేసింని ప్రచారం చేస్తోంది. సహకార ఎన్నికల్లో  బరిలో నిలిస్తే ... రైతు బంధు, పంట రుణాల మాఫీ వంటి అంశాలను చర్చకు పెట్టొచ్చన్నది కాంగ్రెస్‌ సీనియర్‌ నేతల వాదన. కానీ, కాంగ్రెస్‌ పార్టీ ఆదిశగా సీరియస్‌గా ప్రయత్నిస్తున్నట్టు కనిపించడం లేదు. 

 

ఎన్నికల్లో కాంగ్రెస్ బరిలో ఉంటే... రైతులకు కేసీఆర్ ఇచ్చిన హామీలు, రైతుల సమస్యలను చర్చకు పెట్టడంతో పాటు... ఆ వర్గంలోకి వెళ్ళడానికి ఆ పార్టీకి అవకాశం లభిస్తుంది. కానీ కాంగ్రెస్ అందుకు సిద్ధంగా ఉన్నట్టు మాత్రం కనిపించడం లేదు. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ ఎంత సీరియస్ గా ముందుకు పోయినా.. ఏదో ఒక కారణంగా వెనక్కి పోతోంది. తెలంగాణలో పుంజుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తుండగా.. బీజేపీ పక్కలో బల్లెంలా తయారయింది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: