మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డి కుటుంబానికి షాక్ మీద షాక్ లు తగులుతున్నాయి. తాజాగా జేసీ ట్రావెల్స్‌లో ఫోర్జరీ డాక్యుమెంట్లు బయటపడటంతో వారు మరో వివాదంలో చిక్కుకున్నారు. ఈ కేసులో జేసీ దివాకర్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి పాత్రలపై పోలీసులు విచారణ చేస్తున్నారు. 

 

వివాదాలకు కేరాఫ్ జేసీ బ్రదర్స్. తాజాగా వారికి మరో షాక్ తగిలింది. జేసీ దివాకర్‌రెడ్డి ట్రావెల్స్‌లో ఫోర్జరీ బాగోతం బయట పడింది.  అధికారుల సంతకాలను ఫోర్జరీ చేసిన జేసీ ట్రావెల్స్‌ ఉద్యోగులను పోలీసులు  ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి ల్యాప్‌ టాప్‌, థంబ్‌ మిషన్‌, రెండు సెల్‌ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరో ఇద్దరు నిందితులు రామ్మూర్తి, ఇమాం పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు.  సీఐలు, ఎస్సైలు, ఆర్టీఏ అధికారుల సంతకాలు ఫోర్జరీ చేసినట్లు పోలీసులు గుర్తించారు. 

 

లారీల విక్రయాల కోసం పోలీసుల అనుమతి తప్పనిసరి.  అయితే ఇవేవీ లేకుండానే.. పోర్జరీ సంతకాలతో అక్రమాలకు పాల్పడ్డారు జేసీ ట్రావెల్స్ ఉద్యోగులు.  ఫోర్జరీ డాక్యుమెంట్లతో 6 లారీలను జేసీ ట్రావెల్స్‌ కర్ణాటకలో విక్రయించింది.  జేసీ ప్రభాకర్‌రెడ్డి సతీమణి ఉమాదేవి జేసీ ట్రావెల్స్‌ ఎండీగా ఉన్నారు. ట్రావెల్స్‌ యాజమాన్యం ఒత్తిడి మేరకే సంతకాలు ఫోర్జరీ చేసినట్లు నిందితులు  విచారణలో తేలిందని పోలీసులు చెబుతున్నారు.


    
జేసీ సోదరుల అవినీతి చిట్టా రోజు రోజుకు పెరుగుతుందని, వాహనాల ఎన్ వో సి పేరుతో అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి. నకిలీ  సర్టిఫికెట్లు... ఫోర్జరీ సంతకాలతో మోసాలకు పాల్పడ్డారని విమర్శించారు.  ప్రతి దాంట్లో జేసీ కుటుంబ హస్తం ఉందని., జేసీ బినామీ వ్యాపారాలు ఒక్కొక్కటిగా బయట పెడ్తానని అన్నారు కేతిరెడ్డి.

 

 ఈ కేసులో మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి పాత్రపైనా పోలీసులు విచారణ జరుపుతున్నారు. మరోవైపు జేసీ బినామీ వ్యాపారం బయట పడతానని కేతిరెడ్డి పెద్దారెడ్డి హెచ్చరించారు. మొత్తంమీద.. జేసీ బ్రదర్స్ కొద్దిరోజులుగా గడ్డు పరిస్ధితులను ఎదుర్కోవడం రాజకీయ చర్చకు దారితీసింది. 


 

మరింత సమాచారం తెలుసుకోండి: