ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట ఇస్తే, దాన్ని ఖచ్చితంగా అమలు చేసి చూపిస్తాడన్న నమ్మకాన్ని నిలబెట్టుకునే దిశగా ఆయన మరొక అడుగు వేయనున్నట్లు వైస్సార్ కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి . నెల్లూరు జిల్లాకు చెందిన బీసీ నాయకుడు బీద మస్తాన్ రావు కు రాజ్యసభ టికెట్ ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి నిర్ణయించినట్లు తెలుస్తోంది . టీడీపీ లో సుదీర్ఘ కాలం పనిచేసిన మస్తాన్ రావు , చంద్రబాబు అత్యంత విధేయుడిగా కొనసాగారు .   పార్టీ అవసరాల కోసం ఆయన్ని పలు మార్లు  ఎన్నికల బరిలోకి చంద్రబాబు దించారు . దీనితో ఆర్ధికంగా నష్టపోయిన మస్తాన్ రావు , హఠాత్తుగా జగన్మోహన్ రెడ్డి సమక్షం లో వైస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు .

 

రాష్ట్రం లో బీసీ లలో అతిపెద్ద సామాజికవర్గాల్లో ఒకటైన యాదవ సామాజికవర్గానికి రాజ్యసభ పదవి కట్టబెట్టడం ద్వారా ఆ వర్గాన్ని తమవైపు తిప్పుకోవచ్చన్నది వైస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యూహంగా కన్పిస్తోంది . తెలుగుదేశం పార్టీ ఇంతవరకూ యాదవులకు రాజ్యసభ పదవి కట్టబెట్టలేదు . రాజ్యసభ స్థానం కోసం ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో టీడీపీ లో కొనసాగుతున్న సమయం లో ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర మంత్రి  తలసాని శ్రీనివాస్ యాదవ్ ,    సీనియర్ నేత యనమల రామకృష్ణుడు తోపాటు బీద మస్తాన్ రావులు కూడా చంద్రబాబు ను కలిసి తమ మనస్సులోని మాట చెప్పుకున్నారు .

 

అయితే యాదవులకు రాజ్యసభ స్థానం కట్టబెట్టకుండా , చంద్రబాబు ఎప్పటికప్పుడు దాటవేస్తూ వచ్చారన్న విమర్శలున్నాయి . ఒక దశలో యనమలకు రాజ్యసభ పదవి ఖాయమన్న ఊహాగానాలు వినిపించినప్పటికీ, ఆయనకు కూడా చంద్రబాబు , రాజ్యసభ అవకాశాన్ని కల్పించకుండా పారిశ్రామికవేత్తలకు మాత్రమే ఇచ్చారన్న ఆరోపణలు ఉన్నాయి . ఈ నేపధ్యం లో చంద్రబాబు చేయని పనిని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేస్తుండడంతో, యాదవ సామాజికవర్గం  ఇక వైస్సార్ కాంగ్రెస్ వైపు చూసే అవకాశాలు లేకపోలేదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు . 

మరింత సమాచారం తెలుసుకోండి: