జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పార్టీ నేత‌ల‌తో స‌మావేశం సంద‌ర్భంగా ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. కర్నూలు, ఎమ్మిగనూరు క్రియాశీలక కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన ఆయ‌న‌...రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి భయపడుతున్నారని అన్నారు. యువతకు ఉపాధి అవకాశాలు పెరగాలంటే పరిశ్రమలు రావాలని...పరిశ్రమలు రావాలంటే నాయకులు వాటాలు అడగటం మానేయాలని అన్నారు. అమరావతే ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఉండాలని మాట్లాడితే నా దిష్టిబొమ్మను దగ్ధం చేసేంత కోపం ఉన్న కర్నూలు నాయకులకి... సుగాలీ ప్రీతిని అతి దారుణంగా అత్యాచారం చేసి హత్య చేస్తే ఎందుకు కోపం రాలేదని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. 

 

కర్నూలుకు హైకోర్టు అడిగే ముందు సుగాలీ ప్రీతికి న్యాయం జరిగితే అప్పుడే నైతికంగా బలం చేకూరుతుందనే విషయాన్ని గుర్తించాలి అని ప‌వ‌న్ క‌ళ్యాణ్ అన్నారు. కర్నూలును జ్యుడిషియల్ క్యాపిటల్ చేయడంతోనే అభివృద్ధి జరిగిపోదని, యువతకు ఉపాధి అవకాశాలు పెంచే ప్రణాళికలు కావాలని స్పష్టం చేశారు. పరిశ్రమలు, ఐటిహబ్ లాంటివి నెలకొల్పితేనే అభివృద్ధి జరుగుతుందన్నారు.

 

రాయలసీమ ముస్లింల జీవన ప్రమాణాలు ఎందుకు మెరుగుపడలేదని ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌శ్నించారు. ``భారతదేశం సెక్యులర్ దేశం. ఈ దేశంలో అన్ని మతాలు సమానమే. ఇస్లాం పాటిస్తున్న భారతీయుల్లో సీఏఏ, ఎన్ఆర్సీపై కొంతమంది కావాలనే విషప్రచారం చేశారు. ఈ దేశంలో పుట్టిన ముస్లింలకు సీఏఏ, ఎన్ఆర్సీ వల్ల ఇబ్బంది కలుగుతుంది అంటే భారతీయ జనతా పార్టీతో ఎందుకు జతకడతాను? కాంగ్రెస్ , వైసీపీ పార్టీలు సెక్యులర్ పార్టీలు అయితే రాయలసీమలో ముస్లింల జీవన ప్రమాణాలు ఎందుకు పెరగలేదు. కులం, మతం, వర్గం, వర్ణం పేరు చెప్పి నాయకులు ఎదుగుతున్నారు తప్ప సాటి మనిషి జీవితంలో ఎలాంటి మార్పు రావడం లేదు. భగవంతుడు, భగవత్ తత్వాన్ని అర్ధం చేసుకున్న ఎవరూ కూడా గొడవలు పడరు. నిజమైన హిందువులు, నిజమైన ముస్లింలు, నిజమైన క్రిస్టియన్లు సబ్ కా మాలిక్ ఏక్ హై అనే అంటారు. మతానికి ఇబ్బంది జరిగితే మొదట గొంతెత్తేది నేనే` అని చెప్పుకొచ్చారు. భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకుంటే చాలా మంది మైనార్టీలు నమ్మకం ద్రోహం చేశారని అంటున్నారని ప‌వ‌న్ వాపోయారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: