దశాబ్దాలుగా సెక్యులర్ పార్టీలు అని చెప్పకుంటున్న ఏ పార్టీ కూడా రాయలసీమను అభివృద్ధి చేయలేకపోయిందని జ‌న‌సేన పార్టీ అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ అన్నారు. యువతకు ఉపాధి కల్పించలేకపోయాయని ఆరోపించారు. శంషాబాద్ లో  కర్నూలు, ఎమ్మిగనూరు నియోజకవర్గాల క్రియాశీలక కార్యకర్తల సమావేశం జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నిర్వహించారు. ఈ సందర్భంగా కర్నూలు, ఎమ్మిగనూరు నియోజకవర్గాల్లో ఉన్న సమస్యలు, పెన్షన్లు, రేషన్ కార్డులను తొలగిస్తున్న గ్రామ వాలంటీర్ల తీరు గురించి కార్యకర్తలు పవన్ కళ్యాణ్‌కు తెలియచేశారు. 

 


అనంత‌రం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ "రాయలసీమ ప్రాంతం కొన్ని కుటుంబాలు, గ్రూపుల చేతిలో చిక్కుకుపోయింది. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా పాలకులు మారతారు తప్ప ప్రజల తలరాతలు మారవు. ఇప్పటి వరకు సీమ నుంచి ఆరుగురు ముఖ్యమంత్రులు వచ్చినా పరిశ్రమలు స్థాపించి యువతకు ఉపాధి కల్పించలేకపోయారు. నాయకులు వేల కోట్లు సంపాదిస్తున్నారుగానీ ప్రజల జీవితాల్లో మార్పు మాత్రం రావడం లేదు. వాళ్ల మోచేతి నీళ్లు తాగే మనం బతకాలని వారు కోరుకుంటున్నారు.`` అని అన్నారు.  జగన్ రెడ్డి గారు రాయలసీమలో ఒక ఐటీ హబ్ ఎందుకు అభివృద్ధి చేయలేకపోతున్నారు. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలి, రాష్ట్రంలో పరిశ్రమలు స్థాపించాలనే లక్ష్యంతోనే బీజేపీతో జనసేన పార్టీ జతకట్టింది. మన జీవితం మారాలంటే పరిశ్రమలు రావాలి .. పరిశ్రమలు రావాలి అంటే పెట్టుబడుదారుల్లో విశ్వాసం రావాలి... పెట్టుబడుదారుల విశ్వాసం చూరగొనాలి అంటే రాజకీయ నాయకులు వాటాలు అడగటం మానేయాలి. అలాంటి పాలనను జనసేన పార్టీ తీసుకొస్తుంది. అతి తర్వలో జనసేన కర్నూలు పార్లమెంట్ కార్యాలయాన్ని కర్నూలు పట్టణంలో పెడతాం. స్థానిక సమస్యలను తెలుసుకోవడానికి ఈ నెల 12, 13 తేదీల్లో కర్నూలు జిల్లాలో పర్యటిస్తా`` అని చెప్పారు.

 

ఈ సంద‌ర్భంగా పార్టీ గురించి ప‌వ‌న్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్రంలో ఏ వార్డుకు వెళ్లినా అయిదుగురు జనసైనికులు ఉంటే 500 మంది నా అభిమానులు ఉన్నారు. అభిమానులను జనసైనికులుగా మార్చలేకపోయాం. దీనికి కారణం స్థానికంగా బలమైన నాయకత్వం లేకపోవడం. స్థానికంగా బలంగా ఉండే నాయకులు నా దగ్గరకు రారు. అందుకు కారణం తొలి సమావేశంలోనే ప్రజలకు ఏం చేద్దాం అని అడుగుతాను. అందుకే నన్ను చూడగానే వాళ్లు చిరాకుపడతారు`` అని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: