ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా కేంద్రం వ్యవహరిస్తోందని, ఆ పార్టీల రాజకీయ ప్రత్యర్థులు కొద్దిరోజులుగా విమర్శలు చేస్తూనే ఉన్నారు. ముఖ్యంగా మూడు రాజధానులు, శాసన మండలి రద్దు తదితర విషయాల్లో కేంద్రం ఏపీ ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడడంతో ఈ అనుమానాలు పెరిగిపోయాయి. మొన్నటి వరకు రాజధానిగా అమరావతిని ఉంచాలంటూ ఏపీ బీజేపీ నాయకులు కూడా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. మూడు గ్రూపులుగా ఉన్న ఏపి బిజెపి లో రెండు వర్గాల వారు రాజధాని వ్యవహారాన్ని వ్యతిరేకించారు. అయితే తాజాగా బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు జగన్ ను ఏకాంతంగా కలిశారని, ఈ విషయం ఏపీ బిజెపి నాయకులకు కూడా తెలియదని, వారి కలయిక వెనుక రాజకీయాలు చాలా ఉన్నాయనే విమర్శలు టిడిపి నాయకులు చేపట్టారు. 


ముఖ్యంగా టిడిపి నాయకుడు, ఆర్టీసీ మాజీ చైర్మన్ వర్ల రామయ్య ఈ ఆరోపణలు చేశారు. జీవీఎల్ నరసింహారావు బిజెపి నాయకుడు అనే విషయాన్ని మర్చిపోయి ఏపీ వ్యవహారాల్లో ఎందుకు జోక్యం చేసుకుంటున్నాడు అని వర్లరామయ్య ప్రశ్నల వర్షం కురిపించారు. ఏపీలో మూడు రాజధానులు ఉంటే తప్పేంటి అని ప్రశ్నిస్తున్న జీవీఎల్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అక్కడితో ఆగకుండా ఖబడ్దార్ అంటూ హెచ్చరికలు కూడా చేశారు. అసలు ఏపీలో వైసీపీ ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడడం ఏంటి ..?   ఢిల్లీలోని లోథి హోటల్‌లో వైసిపి అధినేత జగన్ ను జీవీఎల్ ఎందుకు కలిశారని వర్ల రామయ్య అనుమానం వ్యక్తం చేశారు. 


అప్పటి నుంచే మూడు రాజధానులు విషయంపై జీవీఎల్ ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జీవీఎల్ నీకు దమ్ముంటే రాజధాని అమరావతిలో పర్యటించాలంటూ సవాల్ చేశారు. బిజెపి లో ఉంటూ వైసిపి కి అనుకూలంగా వ్యవహరిస్తున్న జీవీఎల్ ను ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ కంట్రోల్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అయితే చేసిన విమర్శల్లో అన్ని విషయాలను పక్కన పెడితే... జగన్ ను ఢిల్లీలో జీవీఎల్  ఏకాంతంగా కలుసుకున్నారు అన్న విషయంపైనే అందరిలోనూ ఆసక్తి పెరిగింది. వారిద్దరూ అసలు నిజంగా కలుసుకున్నారా ..?  కలుసుకుంటే ఏ విషయాలపై చర్చించారు అనే విషయాలు అందరికీ ఆసక్తిగా మారాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: