టీడీపీ అధినేత చంద్రబాబుకు ప్రస్తుతం బ్యాడ్ టైమ్ నడుస్తోంది. అటు అధికారం పోయింది. మరోవైపు కేసులు చుట్టుముడుతున్నాయి. దీనికితోడు ఇటీవల సుప్రీంకోర్టు ఆరు నెలల కంటే ఎక్కువ కాలం స్టే లు ఉండరాదని తీర్పు చెప్పింది. దీంతో ఒక్కో కేసులో ఆయనపై ఉచ్చు బిగుసుకుంటోందన్న వార్తలు వస్తున్నాయి. తాజాగా.. చంద్రబాబు ఆస్తుల కేసుపై ఏసీబీ కోర్టులో కీలక విచారణ జరిగింది. తెలుగు అకాడమీ చైర్‌పర్సన్‌ లక్ష్మీపార్వతి వేసిన పిటిషన్‌పై హైదరాబాద్‌ ఏసీబీ కోర్టులో వాదనలు జరిగాయి.

 

 

చంద్రబాబు కేసు రిజిస్టర్‌ కాకముందే హైకోర్టు నుంచి స్టే ఎలా తెచ్చుకున్నారని లక్ష్మీపార్వతి కోర్టు ద్వారా ప్రశ్నించారు. ఎమ్మెల్యేగా రూ.300 తీసుకున్న బాబు.. తర్వాత అక్రమంగా రూ.వేలకోట్లు సంపాదించారని ఆరోపించారు. అయితే.. చంద్రబాబు తరపున లాయర్ తన వాదనల్ని వినిపించారు. లక్ష్మీపార్వతి వాదనలకు కౌంటర్ ఇచ్చారు. హైకోర్టులో ఇప్పటికే ఈ కేసుపై స్టే ఉందని చంద్రబాబు తరపు లాయర్‌ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన ఏసీబీ కోర్టు.. ఆ స్టే వివరాలను పరిశీలిస్తామని తెలిపింది.

 

 

చివరకు ఈ పిటిషన్‌పై విచారణను ఈనెల 14కు వాయిదా వేసింది. ఇక ఈ కేసు వివరాల్లోకి వెళ్తే.. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించారని.. ఏసీబీ విచారణకు ఆదేశించాలని లక్ష్మీపార్వతి 2005లోనే ఏసీబీ స్పెషల్ కోర్టులో ఫిర్యాదు చేశారు. ఈ కేసు విచారణ ప్రారంభంకాక ముందే చంద్రబాబు ఇంప్లీడ్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఫిర్యాదును స్వీకరించడానికి ముందే వాదనలు ఎలా వింటామని చంద్రబాబు అభ్యర్థనను ఏసీబీ కోర్టు తోసిపుచ్చింది.

 

 

అయితే.. ఆ తర్వాత బాబు హైకోర్టులో రిట్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌పై విచారణ జరిపి ఏసీబీ కోర్టులో విచారణకు సంబంధించిన తదుపరి చర్యలు నిలిపేస్తూ 2005లోనే స్టే విధించారు. అయితే ఫిబ్రవరి 14 వ తారీఖున ఏం జరుగుతుందో అన్న ఉత్కంఠ నెలకొంది. చంద్రబాబు ఆస్తులపై ఏసీబీ కోర్టు విచారణకు ఆదేశిస్తే.. అది సంచలనమే అవుతుంది. చంద్రబాబు మొదటిసారి విచారణ ఎదుర్కొంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: