ఏపీ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు ఊహించని షాక్ ఇచ్చింది. ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలను ప్రామాణికంగా తీసుకొని చేపట్టిన సర్వేలో రాష్ట్రంలో ఉన్న రేషన్ కార్డుల్లో దాదాపు 19 లక్షల రేషన్ కార్డుల్లో కోత విధించింది. పౌరసరఫరాల శాఖ వర్గాల సమాచారం ప్రకారం ఈ సంఖ్య 20 లక్షలకు పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఒక్కో కుటుంబంలో ఒక్కో కార్డుకు ముగ్గురు చొప్పున లెక్కేసిన రాష్ట్రంలో దాదాపు 60 లక్షల మందికి వచ్చే నెల నుండి బియ్యం, ఇతర సరుకుల పంపిణీ నిలిచిపోనుంది. 
 
అధికారికంగా ప్రభుత్వం నుండి దీనికి సంబంధించిన సమాచారం అందాల్సి ఉంది. గుంటూరు, కృష్ణా, తూర్పుగోదావరి జిల్లాల్లో భారీ సంఖ్యలో రేషన్ కార్డుల్లో కోత విధించినట్టు తెలుస్తోంది. ప్రభుత్వం ప్రజలకు రేషన్ కార్డుల స్థానంలో బియ్యం కార్డులను పంపిణీ చేయనుంది. ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులను, ఆదాయపు పన్ను చెల్లించేవారిని, నెలకు 200 యూనిట్ల కంటే ఎక్కువ విద్యుత్ వినియోగించే వారిని, 750 చదరపు అడుగుల కంటే ఎక్కువ విస్తీర్ణంలో ఇల్లు ఉన్నవారిని, నాలుగు చక్రాల వాహనాలు ఉన్నవారిని అనర్హులుగా తేల్చింది. 
 
ఈ నెల 2వ తేదీ వరకు ప్రభుత్వం అభ్యంతరాలను స్వీకరించటంతో పాటు ఇప్పటికే తుది జాబితాను రూపొందించింది. ఫిబ్రవరి 15వ తేదీ నుండి బియ్యం కార్డుల పంపిణీ జరగనుంది. కార్డుదారుల వివరాలను గ్రామ సచివాలయాలు, క్లస్టర్ల వారీగా మ్యాపింగ్ చేస్తున్నారు. కొత్త బియ్యం కార్డులు ఉన్నవారికి మాత్రమే మార్చి నెల నుండి బియ్యం పంపిణీ జరగనుంది. అధికారులు మాత్రం అర్హులై బియ్యం కార్డు మంజూరు కాకపోతే ధరఖాస్తులు తీసుకొని కొత్త కార్డులు ఇస్తామని చెబుతున్నారు. 
 
ప్రభుత్వం భారీ సంఖ్యలో రేషన్ కార్డుల్లో కోత విధించటంపై ప్రజల నుండి కొంత అసంతృప్తి వ్యక్తమవుతోంది. ప్రభుత్వం కొన్ని నిబంధనలను సడలించాలని ప్రజల నుండి డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి. కరువు ప్రాంతాలు, వెనుకబడిన ప్రాంతాల విషయంలో నిబంధనలలో మార్పులు చేయాలని వాహనాల నిబంధనల విషయంలో కూడా మార్పులు చేయాలని ప్రజలు కోరుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: