క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అందరిలోను ఇదే అనుమానం పెరిగిపోతోంది. విచక్షణాధికారాల పేరుతో  నిబంధనలకు విరుద్ధంగా  శాసనమండలి ఛైర్మన్ ఎంఏ షరీఫ్ వ్యవహరిస్తున్న తీరే అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. లేని అధికారాలను చేతిల్లోకి తీసుకుని రెండు బిల్లులను సెలక్ట్ కమిటికి పంపుతున్నట్లు ఛైర్మన్ చేసిన ప్రకటనతో వివాదం మొదలైంది. తాను చేయదలచుకున్న పనులను టిడిపినే ఛైర్మన్ ద్వారా చేయిస్తోందన్న విషయం అందరికీ తెలుసు. అందుకనే ప్రభుత్వంతో యుద్ధానికి ఛైర్మన్ రెడీ అయ్యారా అనే సందేహాలు పెరిగిపోతున్నాయి.

 

సెలక్ట్ కమిటికి బిల్లులను పంపే అధికారమే లేదంటే తాజాగా కమిటిలను కూడా ఛైర్మన్ వేసేయటమే అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.  సెలక్ట్ కమిటి ఏర్పాటు విషయం, సభ్యులను ప్రతిపాదించాలనే విషయంలో ఛైర్మన్ కు నిబంధనలను వివరించారు. అయినా సరే అధికారుల మాటలను కూడా లెక్క చేయకుండా తాను చేయదలచుకున్న పనులను ఛైర్మన్ చేసుకుపోతున్నారు. ఇక్కడే ఛైర్మన్ కు శాసనసభా వ్యవహారాల శాఖమంత్రి బుగ్గన రాజేంద్రనాధరెడ్డికి మధ్య వివాదం మొదలైంది.

 

గురువారం మీడియాతో బుగ్గన మాట్లాడుతూ సెలక్ట్ కమిటియే ఏర్పాటు కాలేదని తేల్చి చెప్పేశారు. లేని కమిటీలకు ఛైర్మన్ సభ్యులను ఎలా వేస్తారంటూ మండిపడ్డారు. మంత్రి చెబుతున్నది నిజమే అయినా, నియమ నిబంధనలను అంగీకరించవని తెలిసినా ఛైర్మన్ మాత్రం తాను అనుకున్నదే చేసుకుపోతున్నారంటే అర్ధమేంటి ? ఏమిటంటే ఛైర్మన్ తనంతట తానుగా ఈ పనులన్నీ చేయటం లేదు.

 

చంద్రబాబునాయుడు, యనమల రామకృష్ణుడే తెరవెనుక నుండి ఛైర్మన్ ను ఆడిస్తున్నట్లు వైసిపి నేతలు ఆరోపిస్తున్నారు.  శాసనమండలి రద్దు తీర్మానాన్ని అసెంబ్లీ ఆమోదించి ఢిల్లీకి పంపిదనే ఉక్రోషం చంద్రబాబు, యనమలలో బాగా కనబడుతోంది. దాంతో ఏదైతే అది అయ్యిందని ప్రభుత్వంతో యుద్ధానికి టిడిపి తెగించినట్లే అనుమానంగా ఉంది. ఇప్పటికే టిడిపి, బిజెపి, పిడిఎఫ్ లు కమిటిలకు తమ సభ్యులను ప్రతిపాదించాయి. వైసిపి సభ్యులను ఇవ్వమని చెప్పేసింది. ఇక ఛైర్మన్లుగా వ్యవహరించాల్సిన మంత్రులు కూడా సమావేశాలు నిర్వహించే అవకాశం లేదు. దాంతో  శుక్ర, శని వారాల్లో ఏమి జరగబోతోందో అనే టెన్షన్ పెరిగిపోతోంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: