70 అసెంబ్లీ నియోజకవర్గాలు...672 మంది అభ్యర్థులు...దాదాపు 1.47 కోట్ల మంది ఓటర్లు...ఇది స్థూలంగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నిక‌ల ప‌రిచ‌యం. అధికార ఆమ్‌ఆద్మీ పార్టీతోపాటు బీజేపీ, కాంగ్రెస్‌ ఢిల్లీపై పట్టుసాధించేందుకు హోరాహోరీ తలపడుతున్నాయి. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు మూడు పార్టీలు పూర్తిస్థాయిలో తమ శక్తియుక్తులను ప్రదర్శించాయి. గ‌త ఎన్నికల మాదిరే ఈసారి కూడా క్లీన్‌స్వీప్‌ చేస్తామని ఆమ్‌ఆద్మీ పార్టీ ధీమాగా ఉన్నది. మరోవైపు బీజేపీ 2019 లోక్‌సభ ఎన్నికల ఫలితాలు పునరావృతం అవుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నది. కాంగ్రెస్‌ మాత్రం పరువుకోసం పోరాడుతోంది. 

 

అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తున్న ఢిల్లీ ఎన్నిక‌ల్లో...ముగ్గురు లీడ‌ర్ల భ‌విష్య‌త్తు...రెండు సిద్ధాంతాల పోరాటం అన్న‌ట్లుగా ఢిల్లీ ఎన్నిక‌లు సాగుతున్నాయ‌ని అంటున్నారు. ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ చ‌రిష్మా, ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రివాల్ ప‌రిపాల‌న‌, కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ నాయ‌క‌త్వానికి ఇది ప‌రీక్ష అని పేర్కొంటున్నారు. 

 


ఢిల్లీ రాష్ట్రంలోని ఓటర్ల మూడ్‌ను ఈ ఎన్నికల్లో పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) డిసైడ్ చేయ‌నుందని అంటున్నారు.  కొందరు సీఏఏ అనుకూల, వ్యతిరేక వర్గాలుగా విడిపోయారు. వారు ఏ పార్టీవైపు మొగ్గుచూపుతారనేది ఆసక్తికరంగా మారింది. సీఏఏకు వ్యతిరేకంగా ఢిల్లీలో కొన్నాళ్లుగా భారీ ఎత్తున నిరసనలు వెల్లువెత్తుతున్న సంగ‌తి తెలిసిందే. వందల మంది నిరసనకారులు ముఖ్యంగా మహిళలు, చిన్నారులు డిసెంబర్‌ 15 నుంచి షాహీన్‌బాగ్‌లో నిరసనలు తెలుపుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వారిని ఆకర్షించేందుకు అధికార ఆమ్‌ఆద్మీపార్టీతోపాటు కాంగ్రెస్‌ సహా ఇతర ప్రతిపక్షాలు తీవ్రంగా ప్రయత్నించాయి. మరోవైపు సీఏఏకు అనుకూలంగా బీజేపీ పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించింది. పలువురు బీజేపీ నేతలు నిరసనకారులపై ఘాటు వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు.  నేపథ్యంలో ఓటర్లు ఎటువైపు మొగ్గుతారనేది ఆసక్తికరంగా మారింది.

 


ఇదిలాఉండ‌గా, ప్రశాంత వాతావరణంలో పోలింగ్‌ జరిగేలా ఏర్పాట్లు పూర్తిచేసినట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రణ్‌బీర్‌ సింగ్‌ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 2,689 ప్రాంతాల్లో 13,750 పోలింగ్‌ బూత్‌లను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. సున్నిత ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించామన్నారు. ఢిల్లీవ్యాప్తంగా 516 సున్నిత ప్రాంతాలను గుర్తించామని పేర్కొన్నారు. రాష్ట్ర పోలీసులతోపాటు 190 కంపెనీల సీఆర్పీఎఫ్‌, సీఆర్‌ఏఎఫ్‌ బలగాలను మోహరించినట్టు వెల్లడించారు. గత ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికలతో పోల్చితే ఇది దాదాపు నాలుగు రెట్లు ఎక్కువ. ముఖ్యంగా సీఏఏ నిరసనలకు వేదికైన షాహీన్‌బాగ్‌ను అత్యంత సున్నిత ప్రాంతంగా గుర్తించారు. ఈ ప్రాంతంలోని ఐదు పోలింగ్‌ స్టేషన్ల వద్ద భద్రతను పెంచారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: