హస్తిన పోరులో తుది ఘట్టం మొదలైంది. శనివారం ఉదయం 8 గంటలకు ఢిల్లీ ఫీఠాన్ని అధిష్టించే వారిని నిర్ణయించేందుకు ప్రజలు ఓటింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు. అయితే గతంతో పోలిస్తే ఈ సారి ఎన్నికల సరళి చాలా మందకొడిగా సాగుతోంది. విద్యావంతులు, ఉన్నతవర్గాలు తనకే మద్ధతుగా ఉన్నారని భావిస్తున్న ఆప్‌ వర్గాల్లో పోలింగ్ సరళి గుబులు పుట్టిస్తోంది. ప్రజలు ఓటు వేసేందుకు పెద్దగా ఆసక్తి చూపించకపోవటంతో ఫలితాలు ఎలా ఉండబోతున్నాయన్న అనుమానాలు కలుగుతున్నాయి.

 

పోలింగ్ ప్రారంభమైన మూడు గంటలు దాటిని ఇంకా పోలింగ్‌ శాతం 5 కూడా దాటకపోవటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఢిల్లీలో వాతావరణ పరిస్థితి కూడా పోలింగ్ మందకొడిగా సాగటానికి కారణం అని భావిస్తున్నారు. ఢిల్లీ అసెంబ్లీకి 70 స్థానాలు ఉన్నాయి. 2015లో ఆమ్ ఆద్మీ పార్టీ విజయ కేతనం ఎగురవేసింది. మెజార్టీ స్థానాలను కైవసం చేసుకొని అధికార పీఠాన్ని కైవసం చేసుకుంది. ఇప్పటి వరకు వచ్చిన సర్వే వివరాల ప్రకారం ఈ సారి కూడా ఆప్‌దే విజయం అని అంచనా వేస్తున్నారు.

 

అయితే ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటడంతో ఆ ప్రభావం అసెంబ్లీ ఎన్నికల్లో కనిపిస్తుందన్న వాదన కూడా వినిపిస్తోంది. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 7 స్థానాల్లో గెలిచినా, అసెంబ్లీ ఎన్నికల్లో ఎంత వరకు ప్రభావం చూపుతుందన్న అంశాన్ని మాత్రం అంచనా వేయలేకపోతున్నారు. ఢిల్లీ ప్రజలు మళ్లీ చీపురు కే అధికార పీఠ ఇవ్వాలని భావిస్తున్నారన్న సంకేతాలు వస్తున్నాయి.

 

సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగనుంది. ఆలోపు క్యూ లైన్‌లో ఉన్నవారికి ఓటేసేందుకు ఎన్నికల సంఘం అవకాశం కల్పిస్తోంది. ఈ నెల 11 మంగళవారం రోజున ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపడుతారు. అంటే 11వ తేది మధ్యాహ్నం వరకు ట్రెండ్ తెలిసిపోతోంది. హస్తిన పీఠ ఎవరిదో కూడా తేలనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: