ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి దిశ పోలీస్ స్టేషన్ ను ఈరోజు రాజమండ్రిలో ప్రారంభించారు. సీఎం జగన్ రాష్ట్రంలో మహిళల రక్షణ కొరకు దిశ పోలీస్ స్టేషన్ల ఏర్పాటు దిశగా చర్యలు చేపట్టారు. రాష్ట్రవ్యాప్తంగా 18 దిశ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు కానున్నాయి. సీఎం జగన్ ఈరోజు దిశ యాప్ ను కూడా లాంఛ్ చేయబోతున్నారు. 
 
దేశంలో ఎక్కడా లేని విధంగా మహిళా పోలీస్ స్టేషన్లను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. 24 గంటల పాటు దిశ కంట్రోల్ రూం కూడా మహిళల కొరకు అందుబాటులో ఉండనుంది. దిశ పోలీస్ స్టేషన్లో ఇద్దరు డీఎస్పీ స్థాయి అధికారులతో పాటు 52 మంది సిబ్బంది అందుబాటులో ఉండేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మరికొన్ని దిశ పోలీస్ స్టేషన్లు అతి త్వరలో ప్రారంభం కానున్నాయని సమాచారం. 
 
మహిళలకు భద్రత దిశగా సీఎం జగన్ దిశ చట్టం, దిశ పోలీస్ స్టేషన్ల ఏర్పాటు దిశగా చర్యలు తీసుకుంటున్నారు. ప్రభుత్వం మహిళల కోసం వన్ స్టాప్ సెంటర్ ను కూడా అందుబాటులో ఉంచుతుంది. మహిళలు వన్ స్టాప్ సెంటర్ ద్వారా ఎలాంటి సహాయాన్నైనా పొందే అవకాశం ఉంటుంది. త్వరితగతిన మహిళల సమస్యలకు పరిష్కరించటానికి, నిందితులకు శిక్షలు వేగంగా అమలు చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం దిశ పోలీస్ స్టేషన్లను, చట్టాలను ఏర్పాటు చేస్తోంది. 
 
కేంద్రం ఆమోదం పొందిన తరువాత రాష్ట్రంలో దిశ చట్టం కూడా అమలులోకి రానుంది. ఈ చట్టం ప్రకారం అత్యాచార కేసుల్లో 14 రోజుల్లో విచారణను పూర్తి చేసి 21 రోజులలో ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా శిక్షలను అమలు చేస్తారు. మహిళల గురించి అసభ్యంగా మాట్లాడినా సోషల్ మీడియాలో అసభ్యకర కామెంట్లు చేసినా జరిమానాతో పాటు జైలు శిక్ష కూడా అనుభవించాల్సి ఉంటుంది. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: