ఏపీ సీఎం జగన్ దిశ చట్టం అమలులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 18 దిశ పోలీస్ స్టేషన్లు ఏర్పాటయ్యేలా ఆదేశాలు జారీ చేశారు. సీఎం జగన్ దిశ తొలి పోలీస్ స్టేషన్ ను ఈరోజు రాజమండ్రిలో ప్రారంభించారు. సీఎం జగన్ తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఒక్కో దిశ పోలీస్ స్టేషన్ లో డీఎస్పీలు, సీఐలు, మంత్రులు, ఎస్సైలు కలిపి మొత్తం 52 మంది సిబ్బంది ఉంటారు. 
 
ప్రత్యేక అధికారులుగా ఐఏఎస్ అధికారిణి కృతిక్ శుక్లా, ఐపీఎస్ అధికారి దీపికను ప్రభుత్వం నియమించింది. కొన్ని ప్రత్యేకతలతో ప్రభుత్వం దిశ పోలీస్ స్టేషన్లను, చట్టాన్ని ఏర్పాటు చేసింది. మహిళలు, చిన్నారులపై లైంగిక దాడులకు సంబంధించిన కేసులలో ఐపీసీ 354 ఎఫ్, 354 జి సెక్షన్లు అదనంగా చేరాయి. దిశ పోలీస్ స్టేషన్లలో ఏడు రోజులలో దర్యాప్తు, 14 రోజులలో విచారణ పూర్తవుతుంది. 
 
డీఎస్పీ స్థాయి అధికారి ఈ కేసులను పర్యవేక్షిస్తారు. దిశ పోలీస్ స్టేషన్లకు అనుబంధంగా ప్రత్యేక కోర్టులు కూడా ఏర్పాటు కానున్నాయి. ప్రభుత్వం ప్రత్యేకంగా 13 మంది పబ్లిక్ ప్రాసిక్యూటర్లను ఇందుకోసం నియమించింది. దిశ పోలీస్ స్టేషన్లో పని చేసే వారికి 30 శాతం ప్రత్యేక ఆలవెన్సులను ప్రభుత్వం అందించనుంది. కేసుల దర్యాప్తు కోసం నెలకు లక్ష రూపాయల చొప్పున మంజూరు చేయనుంది. 
 
రాష్ట్రంలో మహిళ ఎక్కడైనా ఫిర్యాదు చేసే విధంగా జీరో ఎఫ్‌ఐఆర్‌ ను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. దిశ పోలీస్ స్టేషన్లు, దిశ చట్టాల ద్వారా గ్యాంగ్ రేప్, రేప్ కు పాల్పడిన వారికి ఉరిశిక్ష పడనుంది. చిన్నారులపై లైంగిక వేధింపులకు పాల్పడితే జీవితఖైదు పడనుంది. డిజిటల్ మీడియా, సోషల్ మీడియా ద్వారా మహిళలను వేధిస్తే మొదటిసారి రేండేళ్లు రెండోసారి నాలుగేళ్లు జైలుశిక్ష పడనుంది. రాష్ట్రంలో మహిళల రక్షణ కోసం దిశ పోలీస్ స్టేషన్లను సీఎం జగన్ ఏర్పాటు చేయడంపై మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: