ఏపీ మూడు రాజధానుల విషయంలో తాము జోక్యం చేసుకోలేమని కేంద్రం కొద్దిరోజుల కిందట పార్లమెంట్‌లోనే ఈ విషయాన్ని కుండబద్ధలు కొట్టింది. దీంతో ఏపీలోని అధికార పార్టీకి ఈ విషయంలో కేంద్రం నుంచి దాదాపుగా లైన్ క్లియర్ అయ్యినట్లే. అంతవరకూ బాగానే ఉన్నా... కేంద్రం ప్రకటనతో, ఏపీ బీజేపీకి చెందిన నాయకుడు సుజనా చౌదరి పూర్తి ఇరకాటంలో పడిపోయారని రాజకీయవర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది.

 

మూడు రాజధానులపై ఏపీ ప్రభుత్వం ప్రకటన చేసినప్పటి నుంచి.. దీన్ని గట్టిగా వ్యతిరేకిస్తున్న వారిలో సుజనా చౌదరి అందరికంటే ముందుండేవారు. ఈ విషయంలో సరైన సమయంలో కేంద్రం జోక్యం చేసుకుంటుందని, అన్ని విషయాలు కేంద్ర పెద్దల దృష్టికి తాను తీసుకెళుతున్నానని ఆయన చెబుతూ గతంలో సవాలు చేసారు. అయితే రాజధానుల ఏర్పాటు అంశం రాష్ట్ర పరిధిలోని అంశమని కేంద్రం ప్రకటించనప్పటి నుంచి సుజనా చౌదరి గొంతు మూగబోయింది. 

 

గతంలో వారానికోసారైనా మీడియా ముందుకు వచ్చి, రాజధాని మార్పు సాధ్యంకాదని చెప్పుకుంటూ వచ్చిన సుజనా చౌదరి... ఇప్పుడు మాత్రం సైలెంట్ అయిపోయారు. మొత్తానికి ఏపీ రాజధాని రగడపై కేంద్రం చేసిన ప్రకటన ఆ పార్టీ ఎంపీ నోటికి తాళం వేసిందనే ప్రచారం జరుగుతోంది. గతంలో సుజనా చౌదరి... ముఖ్యమంత్రులు మారినప్పుడల్లా.. రాజధానులు మారుతాయా? అని ప్రశ్నించారు. ఇష్టం వచ్చినట్టు రాజధానులు మారుస్తూ.. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తే.. ఎవరూ ఊరుకోరు అని హెచ్చరించిన సుజనా చౌదరి, నేడు మూగబోయిన పరిస్థితి ఏర్పడింది.

 

ఇంకా.. నాడు అసెంబ్లీలో జగన్‌, వైసీపీకి చెందిన ఇతర ఎమ్మెల్యేలతో సహా అంతా అమరావతి రాజధాని అని ఏకగ్రీవంగా తీర్మానం చేసి కేంద్రానికి పంపారని, ఒక్క ఎమ్మెల్యే కూడా దీనికి వ్యతిరేకత వ్యక్తం చేయలేదు అని, అలా పంపాకే రాజధానికి కేంద్రం రూ.1500 కోట్లు ఇచ్చింది అని.. అన్నట్లుగా కూడా గతంలో అయన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: