దాదాపు ఎనిమిది దశాబ్దాల తర్వాత ఇద్దరు అక్కాచెల్లెళ్లు కలుసుకున్నారు. 78 ఏళ్ల తర్వాత తిరిగి కలుసుకున్న ఆ అక్కాచెల్లెళ్ల ఆనందానికి అవధుల్లేవు. ఆప్యాయంగా ఒకరినొకరు ఆలింగనం చేసుకుని ముద్దులు కురిపించుకున్నారు.  ఈ అపూర్వ ఘట్టం రష్యాలో చోటుచేసుకుంది. ఈ సందర్భంగా వారు పోలీసులు, ఓ టెలివిజన్ షోకి కృత‌జ్ఞ‌త‌లు తెలియజేశారు. యులియా (92), రోజాలినా ఖరితోనోవా (94)లు కలుసుకున్న ఈ మనోహర దృశ్యాన్ని చూస్తూ వారి కుటుంబ సభ్యులు ఉద్వేగానికి గురయ్యారు.

 

యులియా చేతులు పట్టుకుని ‘చెల్లి కోసం వెదుకుతూనే ఉన్నా’ అంటూ రోజాలినా పేర్కొన్నారు. రెండో ప్రపంచ యుద్ధ సమయానికి ఈ అక్కా చెల్లెళ్లు తమ తల్లిదండ్రులతో కలసి స్టాలిన్‌గ్రాడ్‌ నేటి వోల్గోగ్రాడ్‌లో ఉండేవారు. యుద్ధం కారణంగా 1942లో ఈ నగరాన్ని నాజీ సైన్యం చుట్టుముట్టడంతో అక్కడి పౌరులను అధికారులు ఖాళీ చేయించారు. 

 

యులియా ఆమె తల్లితో కలిపి పెంజా నగరానికి చేరుకోగా, రోజాలినా తాను పనిచేస్తున్న కర్మాగారంలోని కార్మికులతో కలిపి చెల్యాబిన్స్క్‌కి చేరింది. అప్పుడు విడిపోయిన సోదరీమణలు తాజాగా చెల్యాబిన్స్క్‌లో కలుసుకున్నారు. యులియా కుమార్తె.. తన తల్లి సోదరి ఆచూకీని కనిపెట్టాలని పోలీసులకు విజ్ఞప్తి చేయగా, ఓ టీవీ షో ద్వారా రోజాలినా తన సోదరి కోసం ప్రయత్నించింది. దీంతో వీరి ప్రయత్నాలు ఫలించి అపూర్వ కలయిక సాధ్యమయ్యింది.

 

రెండో ప్రపంచ యుద్ధంలో నాజీలపై రష్యా విజయం సాధించినా, భారీ ప్రాణనష్టం జరిగింది. అధికారిక వివరాల ప్రకారం ఈ యుద్ధంలో 27 మిలియన్ల మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఏడాది మే 9కి నాజీలపై పూర్తి విజయం సాధించి 75 ఏళ్లు పూర్తికావడంతో సిల్వర్ జూబ్లీ వేడుకలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో నాడు విడిపోయిన ఇద్దరు అక్కాచెల్లెళ్లు ఇప్పుడు కలుసుకోవడం సంబరాలు మరింత ఉత్సాహంగా సాగనున్నాయి. రెండో ప్రపంచ యుద్ధంలో ఇరు వర్గాలూ ఒక్కో మిలియన్ చొప్పున భారీగా సైన్యాలను కోల్పోయాయి

మరింత సమాచారం తెలుసుకోండి: