ఎక్సైజ్ శాఖ మంత్రిగా తెలుగుదేశం ప్రభుత్వంలో పనిచేసిన జవహర్ పై ఇప్పుడు సొంత నియోజకవర్గంలోనే తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఆయన మంత్రిగా పనిచేసిన కాలం నుంచి పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గంలో గ్రూపు రాజకీయాలు ప్రోత్సహించారని, ఇప్పుడు కూడా అదే తరహాలో ఈ గ్రూపు రాజకీయాలు చేస్తున్నారని,   కొవ్వూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని ముక్కలుగా చేసేందుకు ప్రయత్నిస్తున్నారు అంటూ ఆయనపై ఆరోపణలు సొంత పార్టీ నేతల నుంచే వెల్లువెత్తుతున్నాయి. 


ఎన్నికలకు ముందే ఈ వర్గ పోరును గుర్తించిన చంద్రబాబు ఆయనకు ఒక కొవ్వూరు కు బదులుగా కృష్ణాజిల్లా తిరువూరు నుంచి పోటీ చేయించారు. అయితే ఆ ఎన్నికల్లో అనూహ్యంగా ఓటమి చెందారు. ప్రస్తుతం ఆయన దృష్టి మొత్తం కొవ్వూరు నియోజకవర్గం పెట్టడంతో ఆయన మాకు అవసరం లేదంటూ స్థానిక నాయకులు కరాఖండిగా చెప్పేస్తున్నారు. ఈ విషయం అధిష్టానం వరకు వెళ్లడంతో పరిస్థితిని చక్కదిద్దేందుకు మాజీ మంత్రి పితాని సత్యనారాయణ, సీనియర్ నాయకులకు టిడిపి అధిష్ఠానం బాధ్యతలు అప్పగించింది. వారు ఈ విషయంపై పార్టీ శ్రేణులకు నచ్చచెప్పేందుకు ప్రయత్నించినా జవహార్ నాయకత్వాన్ని ఒప్పుకునేందుకు ఇష్టపడటం లేదు.

 

 కొవ్వూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ రాజకీయాలకు జవహార్ ను దూరంగా ఉంచాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఇప్పటి వరకు కొవ్వూరు నియోజకవర్గానికి పార్టీ ఇన్చార్జిగా ఎవరినీ నియమించకుండా ఖాళీగా ఉంచారు. తామంతా పెండ్యాల అచ్చిబాబు నాయకత్వంలోనే పనిచేస్తామని జవహర్ నాయకత్వాన్ని ఎట్టిపరిస్థితుల్లోను ఒప్పుకోము అంటూ వారు చెప్పేస్తున్నారు. ఎలాగు ఆయన మొన్నటి ఎన్నికల్లో తిరువూరు నుంచి పోటీ చేశారు కనుక అక్కడి నుంచే రాజకీయాలు చేసుకోవాలంటూ వారు సూచిస్తున్నారు. ఈ విషయంలో పార్టీ సీనియర్ నాయకులు చెబుతున్న  మాటలను కూడా లెక్కచేయకుండా తమ అసంతృప్తిని , జవహార్ పై ఉన్న ఆగ్రహాన్ని బయటకి వెళ్లగక్కుతున్నారు ? 
 

మరింత సమాచారం తెలుసుకోండి: