కిల్లర్ కరోనా ....పర్యాటక రంగాన్ని అతలాకుతలం చేసేస్తోంది. విదేశీ ప్రయాణం అంటేనే జనం భయంతో హడలిపోతున్నారు. విశాఖ నుంచి వివిధ పర్యాటక ప్రాంతాలకు టూర్లు బుక్ చేసుకున్నవారు... వైరస్‌కు భయపడి అర్దాంతరంగా రద్దు చేసుకుంటున్నారు. మరోవైపు.. సింగపూర్, మలేషియా వంటి దేశాలకు వీసాలు కూడా గణనీయంగా తగ్గిపోయాయి. 

 

కరోనా టెర్రర్...పర్యాటక రంగంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. విదేశాలకు వెళ్లే వారంతా ప్రయాణాలను రద్దు చేసుకుంటున్నారు. దీంతో, ట్రావెల్ ఏజెన్సీలు నీరసించిపోయాయి. విశాఖ నుండి సింగపూర్‌కి స్కూట్ ఎయిర్ లైన్స్ వారానికి నాలుగు రోజులు...  మలేషియాకు ఎయిర్ ఏసియా నాలుగు రోజులు... ఎయిర్ ఇండియా దుబాయ్‌కి రోజూ విమాన సర్వీసులు నిర్వహిస్తున్నాయి. ముందుగా టిక్కెట్లు, హోటళ్లు బుక్ చేసుకుంటే రాయితీలు లభిస్థాయి. దీంతో గ్రూప్ బుకింగ్స్ ద్వారా  విదేశీ ప్రయాణం చేసేవారంతా మూడు నెలల ముందుగానే ప్రణాళిక సిద్ధం చేసుకుంటారు. వ్యాపార రీత్యా వెళ్లేవారు తప్పితే మిగిలిన వర్గాలన్నీ కొన్ని నెలల ముందుగానే టిక్కెట్లు బుక్ చేసుకుంటాయి. కరోనా వైరస్ ఎఫెక్ట్ మొదలయినప్పటి నుంచి విదేశీ ప్రయాణాలకు బుకింగ్స్ బాగా తగ్గిపోయాయంటున్నారు ట్రావెల్ ఆపరేటర్లు. విశాఖ నుంచి సగటున వారానికి రెండు వేల మంది టూరిజం, వ్యాపార అవసరాల కోసం వెళ్లేవారు. ఇప్పుడు ఆ సంఖ్య 300లోపేనని వ్యాపార వర్గాలు చెప్తున్నాయి.

 

అంతర్జాతీయ ఎయిర్ కనెక్టివిటీకి  దుబాయ్, సింగపూర్ ప్రధానమైనవి. ప్రపంచంలో ఏ దేశానికి వెళ్లడానికైనా ఇవి ట్రాన్సిట్ గా ఉపయోగపడుతున్నాయి. ఇక, ఉపాధి,పర్యాటక అవసరాల కోసం వెళ్ళే వారు సంఖ్య అధికమే. కరోనా తీవ్రత ఎంత అధికంగా ఉందో చెప్పడానికి... సింగపూర్, మలేషియా వంటి దేశాలకు అవుతున్న వీసా ప్రాసెసింగ్ ఉదాహరణ అంటున్నారు టూర్ ఆపరేటర్లు. ఇక్కడి నుండే కాకుండా, విదేశాల నుంచి విశాఖపట్నం వచ్చేవారి సంఖ్య కూడా తగ్గిపోయింది. వైజాగ్ పోర్టులు, మెడ్ టెక్ జోన్, స్టీల్ ప్లాంటు, హెచ్ పీసీఎల్, ఐటీ, ఫార్మా తదితర పరిశ్రమలతో... అత్యవసర పనులున్న అధికారులు తప్పితే ఇంకెవరూ రావడానికి ఇష్టపడడం లేదు.  ఇండియా నుంచి సింగపూర్, మలేషియాలకు వెళ్లడానికి జారీచేసే వీసాల సంఖ్య కూడా దారుణంగా పడిపోయింది. తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు నుంచి సింగపూర్ ఎంబసీ వారానికి 40 వేల నుంచి 50 వేల వీసాలు జారీ చేస్తుంది. ఇక,  మలేషియా ఎంబసీ అయితే 60వేల నుండి 70 వేల వీసాలు జారీ చేస్తుంది. గతవారం లెక్కలు తీసుకుంటే సింగపూర్‌కి 8 వేల కంటే ఎక్కువ వీసాలు ఇవ్వలేదని పర్యాటక వర్గాలు చెబుతున్నాయి. 

 

చావు బాజా మోగిస్తున్న కరోనాను కట్టడి చేసేందుకు వివిధ దేశాలు ఆంక్షలు అమలు చేస్తున్నాయి. ఫ్లూ లక్షణాలు కనిపిస్తే పరీక్షలు, పర్యవేక్షణ కోసం రోజుల తరబడి ఐసోలేషన్ కేంద్రాల్లో ఉంచుతున్నాయి. ఇక, పర్యాటక ప్రదేశాల్లో స్వేచ్ఛగా ఉండాల్సిన చోట కరోనాకు భయపడుతూ తిరగడానికి ఎవరు ఇష్టపడడం లేదు. ఈ పరిస్థితుల్లో పర్యాటకరంగంపై ఆధారపడ్డ వారికి ట్యాక్స్ హాలిడే అమలు చేయాలని ఆపరేటర్లు కోరుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: