అమరావతి రాజధానిగా కొనసాగాలని రైతులు ఎన్నో రోజులుగా నిరసనలు, ఆందోళనలు చేపడుతున్నారన్న సంగతి తెలిసిందే. అయితే అమరావతి రాజధానిలో కొనసాగాలని సమ్మక్క, సారలమ్మ లకు పెట్టిన మొక్కలను తీర్చుకునేందుకు ఈరోజున పెద్ద ఎత్తున అమరావతి రైతులు మేడారం జాతరకి వెళ్లారు. అక్కడికి పెద్ద సంఖ్యలో చేరుకున్న రైతులు రాజధాని అమరావతి లో ఉండాలని మొక్కులు తీర్చుకుంటూ నిలువెత్తు బంగారాన్ని సమర్పించి దేవతలను బలంగా కోరుకున్నారు. మూడు రాజధానులు వద్దు.. అమరావతే ముద్దు అని అక్కడి ప్రాంతం దద్దరిల్లేటట్లు రాజధాని రైతులు నినాదాలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మనసు మార్చమని సమ్మక్క, సారలమ్మ దేవతలను రైతులు కోరుకున్నారు.


మరోవైపు కొంతమంది మహిళా రైతులు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. సమ్మక్క, సారలమ్మ లను దర్శించుకున్న అనంతరం అమరావతి మహిళా రైతులు అక్కడికి వచ్చిన తెలంగాణ కాంగ్రెస్ మహిళా ఎమ్మెల్యేను కలుసుకొని వారి బాధలను వెళ్లబోసుకున్నారు. ఈ సందర్భంలోనే ఒక మహిళా రైతు తమకు న్యాయం చేయాలంటూ ఎమ్మెల్యే సీతక్క కాళ్లను పట్టుకొని.. గట్టిగా విలపించారు. దీంతో వెంటనే ఎమ్మెల్యే సీతక్క ఆమెను పైకి లేపి ఓదార్చారు. అలాగే రాజధాని రైతులకు మద్దతు తెలిపారు. రాజధాని అమరావతి గా కొనసాగాలి అంటూ ఎన్నో పోరాటాలు చేస్తున్న రైతులకు తాము అండగా ఉంటామని స్పష్టం చేశారు.


ప్రభుత్వాలు మారినప్పుడల్లా రాష్ట్ర రాజధానులను మార్చడం సరికాదని, అలా చేసి ప్రజలు బాగా ఇబ్బంది పెట్టడం సబబు కాదని ఆమె అభిప్రాయపడ్డారు. సమ్మక్క, సారలమ్మ ఆశీస్సులు ఎల్లవేళలా అమరావతి రైతులకు ఉంటాయని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.


వీరికంటే ముందు అమరావతి రాజధానిగా కొనసాగించాలని కోరుతూ అమరావతి జేఏసీ నాయకులు మేడారం జాతరకు వెళ్లి వన దేవతల ఎదుట తమ కోర్కెలను తెలిపారు. స్పెషల్ బస్సులో జాతరకు పయనమైన వీరు జై అమరావతి జై ఆంధ్రప్రదేశ్ అంటూ నినాదాలు హోరెత్తించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: