దేశ రాజ‌ధాని ఢిల్లీ పౌరులు మ‌ళ్లీ ఆస‌క్తిక‌ర ప‌రిణామాల‌తో వార్త‌ల్లో నిలిచారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో భాగంగా, ఇవాళ ఉద‌యం 8 గంట‌ల నుంచి సాయంత్రం 6 గంట‌ల వ‌ర‌కు పోలింగ్ నిర్వ‌హించిన సంగ‌తి తెలిసిందే. అయితే, ఈ పోలింగ్ ఓటింగ్ మంద‌కొడిగా కొన‌సాగింది. మ‌ధ్యాహ్నం 2 గంట‌ల వ‌ర‌కు కేవ‌లం 28.14 శాతం మాత్ర‌మే ఓటింగ్ జ‌రిగిందంటే ప‌రిస్థితి అర్థం చేసుకోవ‌చ్చు. అయితే, ఈసీ ఒక‌రకంగా దీన్ని ముందే ప‌సిగ‌ట్టింది.

 


ఢిల్లీలోని 30 నియోజకవర్గాల్లో  2019 లోక్‌సభ ఎన్నికల్లో తక్కువ పోలింగ్‌ నమోదైంది. ఈ నేప‌థ్యంలో అక్క‌డ‌ ప్రత్యేకంగా ప్రచారం చేశారు ఎన్నిక‌ల అధికారులు. అంతేకాకుండా న‌గ‌రజ‌నం కోసం అనేక సౌక‌ర్యాలు క‌ల్పించారు.  ఓటర్లను ఆకర్షించేందుకు మొబైల్‌ యాప్స్‌, క్యూఆర్‌ కోడ్‌ వంటివాటితోపాటు సోషల్‌మీడియా వేదికలను వాడుకుంటున్నారు.  11 నియోజకవర్గాల పరిధిలోని ఓటర్లు తమ స్మార్ట్‌ఫోన్‌ను ఉపయోగించి ఎన్నికల సంఘం హెల్ప్‌లైన్‌ ద్వారా క్యూఆర్‌ కోడ్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని, ఇది ఓటర్‌ స్లిప్‌ మాదిరిగా పనిచేస్తుందని అధికారులు తెలిపారు. ఇందుకోసం రాష్ట్రంలోని 11 జిల్లాల నుంచి ఒక్కో నియోజకవర్గాన్ని ఎంపిక చేశామని చెప్పారు. నగర ఓటర్లను ఆకర్షించే చర్యల్లో భాగంగా ఈ పరిజ్ఞానాన్ని తీసుకొచ్చినట్టు పేర్కొన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా వినియోగించిన‌ప్ప‌టికీ....ఇలా పోలింగ్ న‌మోద‌వ‌డం గ‌మ‌నార్హం. 

 

ఢిల్లీ రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 1.47 కోట్ల మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకునేందుకు 2,689 ప్రాంతాల్లో 13,750 పోలింగ్‌ బూత్‌లను ఏర్పాటు చేసినట్టు  రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రణ్‌బీర్‌ సింగ్‌ తెలిపారు. సున్నిత ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించామన్నారు. ఢిల్లీవ్యాప్తంగా 516 సున్నిత ప్రాంతాలను గుర్తించామని పేర్కొన్నారు. రాష్ట్ర పోలీసులతోపాటు 190 కంపెనీల సీఆర్పీఎఫ్‌, సీఆర్‌ఏఎఫ్‌ బలగాలను మోహరించినట్టు వెల్లడించారు. గత ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికలతో పోల్చితే ఇది దాదాపు నాలుగు రెట్లు ఎక్కువ. ముఖ్యంగా సీఏఏ నిరసనలకు వేదికైన షాహీన్‌బాగ్‌ను అత్యంత సున్నిత ప్రాంతంగా గుర్తించారు. ఈ ప్రాంతంలోని ఐదు పోలింగ్‌ స్టేషన్ల వద్ద భద్రతను పెంచారు. ఎన్నికల అధికారులు ఇటీవలే నిరసనకారులతో భేటీ అయ్యి ఓటు హక్కు వినియోగించుకోవాల్సిందిగా కోరారు. ఓటర్లు స్వేచ్ఛగా ఓటుహక్కు వినియోగించుకునేలా, శాంతియుత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా అన్ని రకాల చర్యలు తీసుకున్నట్టు రణ్‌బీర్‌ సింగ్‌ పేర్కొన్నారు. అయినా... వారి ప్ర‌య‌త్నం ఫ‌లించ‌లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: