కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తోంది. మన దేశంలోనూ ఎంటర్ అయ్యిందన్న వార్తలతో జనం ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. హైదరాబాద్ లో వాహనదారులైతే .. బ్రీత్ ఎనలైజర్ టెస్టులకు ససేమిరా అంటున్నారు.. వారికి మద్దతుగా కొన్ని స్వచ్చంద సంస్థలు..  వైరస్ తగ్గే దాకా డ్రంక్ అండ్ డ్రైవ్ లు రద్దు చేయాలని ఏకంగా పోలీస్ ఉన్నతాధికారులకు ఉత్తరాలు రాస్తున్నారు. 

 

చైనా లో పుట్టిన మహమ్మారి కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచాన్ని భయ భ్రాంతులకి గురి చేస్తుంది. చైనాలో ఇప్పటికే వందలాది మంది ప్రాణాలు కోల్పోగా... వేలాది మంది కరోనా భారిన పడి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా కేసులు నమోదవుతూనే ఉన్నాయి. చైనా నుంచి వచ్చే వారికి ఎయిర్ పోర్ట్ లో ప్రత్యేక స్క్రీనింగ్ టెస్టులు సైతం చేస్తున్నారు. 

 

హైదరాబాద్ లో వాహనదారులకు కొత్త చిక్కు వచ్చిపడింది. కరోనా వైరస్ ఎక్కడ తమకు తగులుకుంటుందోనని జంకుతున్నారు.  స్వీయ జాగ్రత్తలు తీసుకున్నా.. ట్రాఫిక్ పోలీసులు తరచూ నిర్వహించే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు కొన్ని రోజులు ఆపాలని కోరుతున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కి తాము వ్యతిరేకం కాదని చెబుతూనే.. ఎవరో ఒకరు ఇద్దరు మందు బాబులను పట్టుకోవడం కోసం తాము డేంజర్ లో కి వెళ్తున్నామని ఆందోళన చెందుతున్నారు.

 

బ్రీత్ ఎనలైజర్ టెస్టుల వల్ల తమకు ప్రమాదం పొంచి ఉందని మరికొందరు వాదిస్తున్నారు. బ్రీత్ ఎనలైజర్ పరీక్ష సమయంలో.. కంటి కి కనపడని క్రిముల కారణంగా తమకు ఇన్ ఫెక్షన్ లు సోకే ప్రమాదం ఉందంటున్నారు వాహనదారులు. 

 

స్వచ్చంద సంస్థలకు చెందిన ప్రతినిధులు సైతం కరోనా వైరస్ పై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.. ఈ మేరకు ఏకంగా పోలీస్ ఉన్నతాధికారులకు లేఖ రాశారు. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు దేవుడెరుగు.. వ్యాధులను కోరి తెచ్చుకుంటున్నట్లు అవుతుందని వాపోతున్నారు. కొన్నాళ్లు పాటు పూర్తిగా ఆపాలని కోరుతున్నారు. బ్రీత్ ఎనలైజర్ టెస్టులతో కొండ నాలుకకు మందు వేస్తే,  ఉన్న నాలుక ఊడినట్లు ఉందని సైటర్స్ వేస్తున్నారు.

 

పోలీసులు మాత్రం బ్రీత్ ఎనలైజర్ తో ఎలాంటి భయం లేదని భరోసా ఇస్తున్నారు. వన్ వే మౌత్ పీస్ విత్ నాన్ రిటర్నింగ్ వాల్ పరిజ్ఞానం తో తయారు చేసినవని... వీటి తో ఎలాంటి బ్యాక్టీరియా, వైరస్, ఇన్ ఫెక్షన్స్ ఉండవని చెప్తున్నారు.

 

మొత్తానికి కరోనా ఎఫెక్ట్ తో వాహనదారులు జడుసుకుంటున్నారు... కరోనా వైరస్ పూర్తిగా సమిసిపోయే దాకా డ్రంక్ అండ్ డ్రైవ్ లు రద్దు చేయాలని కోరుతున్నారు.. కరోనా వైరస్ కన్నా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు అంత ముఖ్యం కాదని వాదిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: