దేశ రాజ‌ధాని ఢిల్లీలో జ‌రుగుతున్న ఎన్నిక‌ల ప‌ర్వంపై ఎగ్జిట్‌పోల్స్ విడుద‌ల‌య్యాయి. ప్ర‌స్తుతం అధికారంలో ఉన్న ఆప్ తిరిగి త‌మ‌దే అధికార‌మ‌ని భావిస్తుండ‌గా...బీజేపీ 2019 లోక్‌సభ ఎన్నికల ఫలితాలు పునరావృతం అవుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తోంది. కాంగ్రెస్‌ మాత్రం పరువుకోసం పోరాడుతోందని ముంద‌స్తు అంచ‌నాలు వెలువ‌డ్డాయి. అయితే, తాజాగా అదే జ‌రిగింది. దాదాపు అన్ని ఎగ్జిట్‌పోల్స్ ఆమ్ ఆద్మీ పార్టీకే ప‌ట్టం క‌ట్టాయి. 

 

ఢిల్లీలో అధికార ఆమ్‌ఆద్మీ పార్టీతోపాటు బీజేపీ, కాంగ్రెస్‌ ఢిల్లీపై పట్టుసాధించేందుకు హోరాహోరీ తలపడ్డాయి. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు మూడు పార్టీలు పూర్తిస్థాయిలో తమ శక్తియుక్తులను ప్రదర్శించాయి. అయితే, ఓట్లు వేసిన అభ్య‌ర్థులు మాత్రం...తాము ఆప్‌కే ప‌ట్టం క‌ట్ట‌నున్న‌ట్లు వెల్ల‌డించారు. ఇండియా న్యూస్‌-నేత ఎగ్జిట్‌పోల్స్‌ అత్య‌ధికంగా ఆప్‌కు 53-57 సీట్లు క‌ట్ట‌బెట్టింది. టీవీ9 భార‌త‌వ‌ర్ష 54, రిప‌బ్లిక్ టీవీ 48-61 సీట్లు క‌ట్ట‌బెట్టింది. మిగ‌తా పోల్స్ 40 సీట్ల‌పైనే...ఆప్‌కు క‌ట్ట‌బెట్టాయి.

 

కాగా, 2015 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి 67 సీట్లు వ‌చ్చాయి.  కానీ గ‌త ఏడాది జ‌రిగిన పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో మొత్తం ఏడు సీట్ల‌ను బీజేపీ గెలుచుకుంది. 2015 అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌ 54.3 శాతం ఓట్లతో 67 స్థానాల్లో, బీజేపీకి 32 శాతం ఓట్లతో మూడు స్థానాల్లో విజయం సాధించాయి. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి 56.58 శాతం, ఆప్‌కు 18శాతం ఓట్లు వచ్చాయి. 

 70 అసెంబ్లీ స్థానాలకు 672 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 2,689 ప్రాంతాల్లో 13,750 పోలింగ్‌ బూత్‌లను ఏర్పాటు చేశారు అధికారులు. ఈ మేర‌కు ఓట‌ర్లు త‌మ ఓటు వినియోగించుకున్నారు. అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు.  కాగా, సీఏఏకు వ్యతిరేకంగా ఢిల్లీలో కొన్నాళ్లుగా భారీ ఎత్తున నిరసనలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఓటర్లు ఎటువైపు మొగ్గుచూపారనేది ఆసక్తికరంగా మారింది. వందల మంది నిరసనకారులు ముఖ్యంగా మహిళలు, చిన్నారులు డిసెంబర్‌ 15 నుంచి షాహీన్‌బాగ్‌లో నిరసనలు తెలుపుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వారిని ఆకర్షించేందుకు అధికార ఆమ్‌ఆద్మీపార్టీతోపాటు కాంగ్రెస్‌ సహా ఇతర ప్రతిపక్షాలు తీవ్రంగా ప్రయత్నించాయి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: