రాష్ట్ర రాజకీయ రాజధానిగా పేరొందిన విజయవాడ నగరంలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఓ వైపు రాజధానిపై రచ్చ జరుగుతుంటే, మరోవైపు స్థానిక ఎన్నికలపై చర్చలు జరుగుతున్నాయి. టీడీపీ నాయకులేమో అమరావతికి జై అంటుంటే...వైసీపీ నేతలు మూడు రాజధానులు ముద్దు అంటున్నారు. మొత్తం మీద వీరి మధ్య విజయవాడ నగర ప్రజలు ఎవరికి అనుకూలంగా ఉన్నారో ఎవరికి అంతు చిక్కకుండా ఉంది. అయితే నగర ప్రజలు ఎక్కువ ఎవరి వైపు ఉన్నారో తెలియాలంటే రానున్న స్థానిక సంస్థలు వరకు ఆగాల్సిందే.

 

విజయవాడ కార్పొరేషన్‌కి జరిగే ఎన్నికల్లో ఓటర్లు ఎవరికి పట్టం కడితే వారే తోపులు అని అర్ధమైపోతుంది. కాకపోతే కార్పొరేషన్ ఎన్నికల వరకు ఆగలేని వారు ఇప్పటి నుంచే గెలుపుపై లెక్కలు వేసేసుకుంటున్నారు. టీడీపీ వాళ్ళు విజయవాడ కార్పొరేషన్‌ మళ్ళీ తమకే సొంతమవుతుందని అంటుంటే, వైసీపీ వాళ్ళు ఈసారి ఫ్యాన్ హవా నడుస్తుందని అంటున్నారు. ఈ క్రమంలోనే ఎవరి అంచనా వారు చెబుతున్నారు.

 

మొన్న 2019 ఎన్నికల ఫలితాలు బట్టి చూస్తే..విజయవాడ నగరంలో ఉన్న మూడు నియోజకవర్గాల్లో ఈస్ట్ టీడీపీ గెలిస్తే, సెంట్రల్, వెస్ట్‌ల్లో వైసీపీ గెలిచింది. ఇక ఎంపీ సీటుని టీడీపీనే ఎగరవేసుకుపోయింది. అయితే ఈస్ట్‌లో టీడీపీ 15 వేలపైన మెజారిటీతో గెలిస్తే, సెంట్రల్‌లో వైసీపీ 25 ఓట్లు, వెస్ట్‌లో 7వేల ఓట్ల తేడాతో గెలిచింది. పైగా రాజధాని అమరావతినే ఉండాలనే డిమాండ్ విజయవాడ ప్రజల్లో ఎక్కువ ఉంది. కాబట్టి దీని బట్టి చూస్తే 2014 మాదిరిగానే ఈసారి కూడా విజయవాడ కార్పొరేషన్ తమ ఖాతాలో వేసుకుంటామని టీడీపీ కేడర్ చెబుతుంది.

 

ఇక అటు తాము రెండు సీట్లు గెలిచాం, పైగా అధికారంలో ఉన్నాం, జగన్ మోహన్ రెడ్డి ప్రజల కోసం బోలెడు సంక్షేమ పథకాలు తీసుకొచ్చారు, విజయవాడ అభివృద్ధిపై మరింత శ్రద్ధ పెట్టి ముందుకెళుతున్నారు. భవిష్యత్‌లో కూడా విజయవాడ అభివృద్ధికి నిధులు కావాలంటే వైసీపీనే గెలవాలని ఆ పార్టీ శ్రేణులు లెక్కలు వేస్తున్నాయి. మరి చూడాలి విజయవాడలో సైకిల్ సవారీ చేస్తుందో? ఫ్యాన్ గిరగిరా తిరుగుతుందో?   

మరింత సమాచారం తెలుసుకోండి: