గ‌త ఏడాది కాంగ్రెస్ పార్టీకి ఊహించిన షాకిచ్చిన జంపింగ్ ఎమ్మెల్యేకు....తెలంగాణ సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్ చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎల్‌బీ న‌గ‌ర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు. హైద‌రాబాద్‌లో టీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో స‌మావేశం అనంత‌రం ఆయ‌నీ ప్ర‌క‌ట‌న చేశారు. అయితే, తాజాగా ఆయ‌న‌కు తెలంగాణ సీఎం కేసీఆర్ తీపిక‌బురు అందించారు. మూసీ రివర్‌ ఫ్రంట్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌గా ఎల్‌బీ న‌గ‌ర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి చాన్సిచ్చారు. ఈ మేర‌కు ఆయ‌న ఉత్త‌ర్వుల‌పై సంత‌కం చేశారు.

 

క్యాబినెట్‌ హోదా కలిగిన మూసీ రివర్‌ ఫ్రంట్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌గా ఎల్బీనగర్‌ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి నియమించారు కేసీఆర్‌. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులపై సీఎం కేసీఆర్‌ సంతకం చేశారు. ఈ పదవిలో ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి చైర్మన్‌గా మూడేళ్ల పాటు కొనసాగనున్నారు. కాగా, జంపింగ్ ఎమ్మెల్యేల్లో గ్రేట‌ర్ ప‌రిధిలో ఇద్ద‌రికి ప‌ద‌వులు ద‌క్కిన‌ట్ల‌యింది. ఇప్ప‌టికే పార్టీ మారిన స‌బితా ఇంద్రారెడ్డికి మంత్రి ప‌ద‌వి క‌ట్టెబ‌ట్టిన సంగ‌తి తెలిసిందే. 

 

కాగా, కాంగ్రెస్‌కు చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్టు ప్రకటించిన అనంత‌రం ఎల్బీనగర్ ఎమ్మెల్యే  సుధీర్ రెడ్డి ఆ పార్టీలో చేరారు. ఆసిఫాబాద్ ఎమ్మెల్యే అత్రం సక్కు, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు, నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రియానాయక్, మహేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి, ఉపేందర్‌రెడ్డి, ఇప్పటికే కేసీఆర్‌కు మద్దతు ప్రకటించారు. ఆ జాబితాలో సుధీర్ రెడ్డి చేరారు. కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పిన అనంత‌రం సుధీర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, తాను కేటీఆర్‌ను కలిసిన మాట వాస్తవమ‌ని అన్నారు. తాను కాంగ్రెస్ వీడి టీఆర్ఎస్‌లో చేరాలని నిర్ణయించుకున్నట్లు స్ప‌ష్టం చేశారు. నియోజకవర్గ అభివృద్ధిపై కేటీఆర్ పూర్తి స్థాయి హామీ ఇచ్చారన్నారు. ఎల్బీనగర్ చెరువుల సుందరీకరణ, బీఎన్ రెడ్డి కాలనీల రిజిస్ట్రేషన్స్ సమస్య, ఎల్బీనగర్ ఆస్తి పన్ను సమస్యల పరిష్కారానికి కేటీఆర్ హామీ ఇచ్చారని వెల్ల‌డించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: