ప్ర‌పంచ‌వ్యాప్తంగా తీవ్ర చర్చ‌నీయాంశంగా మారిన క‌రోనా వ్యాధి గురించి త్రిదండి చినజీయర్ స్వామీజీ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. క‌రోనా వ్యాధి గురించి ఆయ‌న స్పందిస్తూ అంత‌కంటే పెద్ద ముప్పు ప్ర‌స్తుతం మ‌నం ఎదుర్కుంటున్న‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు. రంగారెడ్డి జిల్లాలోని శంషాబాద్‌లో వికాస తరంగిణి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా మహిళా వైద్య శిభిరాన్ని త్రిదండి చినజీయర్ స్వామీజీ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా త్రిదండి చినజీయర్ స్వామీజీ మాట్లాడుతూ..క్యాన్సర్ మహమ్మారి పట్ల మహిళలు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు.  క్యాన్సర్ వ్యాధి కరోనా వైరస్ కంటే ప్రమాదకరమైనదని పేర్కొన్నారు.

 

దినదినానికి క్యాన్సర్ వ్యాధి గ్రస్థుల సంఖ్య రెట్టింపు అవుతోందని త్రిదండి చినజీయర్ స్వామీజీ ఆందోళన వ్యక్తం చేశారు. వ్యాధి పట్ల మహిళలకు అవగాన కల్పించాల్సిన అవసరం ఎంతయినా ఉందని చెప్పారు. క్యాన్సర్ వ్యాధి ని నిర్మూలించకపోతే భవిష్యత్తు లో మరణాల సంఖ్య అధికం కాక తప్పదని చినజీయర్ స్వామీజీ హెచ్చరించారు. మరోవైపు మహిళల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని వికాసతరంగిణి ఉచిత మహిళా మెగా వైద్య శిభిరాన్ని నిర్వహించడం అభినందనీయం అన్నారు. 

 

ఇదిలాఉండ‌గా క్యాన్స‌ర్ వ్యాధికి అనేక కార‌ణాలు ఉన్న సంగ‌తి తెలిసిందే. పొగాకు వాడేవాళ్లు, అతిగా ఆల్కహాల్‌ తీసుకునేవాళ్లు, కాలేయ వ్యాధులున్నవాళ్లకు క్యాన్సర్‌ వచ్చే అవకాశాలు ఎక్కువ. శారరీక శ్రమ తక్కువగా ఉండడం, స్థూలకాయం, కొవ్వు ఎక్కువగా ఉండే ఆహారం అతిగా తీసుకునేవాళ్లు, రసాయన పరిశ్రమల్లో పనిచేసేవాళ్లు, కుటుంబంలో ఎవరికైనా క్యాన్సర్‌ ఉన్నవాళ్లు, వయసు పైబడినవాళ్లు క్యాన్సర్‌ స్క్రీనింగ్‌ పరీక్షలను చేయించుకోవాలి.  20 ఏళ్లు దాటిన వాళ్లు తమకు తాము స్నానం చేసేటప్పుడు రొమ్ము పరీక్ష చేసుకోవాలి. ఎడమ అరచేతితో కుడి రొమ్మును, కుడి అరచేతితో ఎడమ రొమ్మును పరీక్ష చేసుకోవాలి. ఎక్కడైనా గట్టిగా, గడ్డలాగా తగిలితే వెంటనే డాక్టర్‌ను కలవాలి. నిపుల్స్‌ ఒకే పరిమాణంలో, ఒకే వరుసలో ఉన్నాయో లేదో, వాటి నుంచి ఏమైనా స్రావాలు వస్తున్నాయా చూసుకోవాలి. నెలసరి ఆగిపోయిన స్త్రీలు కూడా పరీక్షించుకోవాలి. 30 ఏళ్ల నుంచి ప్రతి 5 ఏళ్లకోసారి మామోగ్రఫీ టెస్టు చేయించుకోవాలి. 40 తరువాత 50 ఏళ్ల వరకు రెండు నెలలకోసారి చేయించుకోవాలి. 50 ఏళ్లు దాటాక ప్రతి ఏటా పరీక్ష చేయించుకోవాలి. రిస్క్‌ కారకాలున్నవాళ్లు 40 ఏళ్ల వయసునుంచే ప్రతి ఏటా చేయించుకోవాలి. రొమ్ము క్యాన్సర్‌కు జన్యుమూలాలను గుర్తించే పరీక్షలు కూడా ఉన్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: